Begin typing your search above and press return to search.

రజనీ కమల్ వల్ల కాలేదు...విజయ్ సాధించి చూపించారు !

తమిళనాడు రాజకీయాలు వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అక్కడ సినిమాలు రాజకీయాలు రెండూ కూడా కలగలిసిపోయి ఉంటారు.

By:  Tupaki Desk   |   4 May 2026 6:00 PM IST
రజనీ కమల్ వల్ల కాలేదు...విజయ్ సాధించి చూపించారు !
X

తమిళనాడు రాజకీయాలు వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అక్కడ సినిమాలు రాజకీయాలు రెండూ కూడా కలగలిసిపోయి ఉంటారు. వెండి తెర వెలుపులనే తమ సమస్యలు తీర్చే ప్రజా నాయకులుగా చేసుకోవడం తమిళ జనాలకు అలవాటి ఆ పరంపరలో ఒక కరుణానిధి ఎంజీఆర్ జయలలిత వచ్చారు. తరువాత తరంలో చూస్తే ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లో ఆ రేర్ ఫీట్ సాధించాలని చూశారు, వెనక్కి పోయారు. అయితే ఇద్దరు సూపర్ స్టార్లు మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తిని పెంచుకుని కూడా గమ్యం చేరుకోలేకపోయారు వారే సూపర్ స్టార్ రజనీ కాంత్, విశ్వనటుడు కమల్ హాసన్. ఈ ఇద్దరూ రాజకీయాల్లో చేయలేనిది ఇపుడు విజయ్ సాధించి చూపించారు. తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రి ఆయన కోబోతున్నారు.

రజనీ రాజకీయం :

తమిళనాడు రాజకీయాలతో పరోక్షంగా రజనీకాంత్ కి 1996 నుంచి సంబంధం ఉంది. ఆయన మద్దతు ఇచ్చిన పార్టీలు గెలిచి అసెంబ్లీకి పార్లమెంట్ కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆనాటి నుంచే రజనీ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని అభిమాన గణంతో పాటు సాదర జనం కూడా అనుకున్నారు. ఇపుడూ అపుడూ వస్తారు అని రజనీ ఊరించారు. అయితే ఆయన 2020 డిసెంబర్ 3న లో మాత్రం తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఆ తరువాత 2021 జనవరిలో మక్కల్ సేవై కచ్చి అని తన పార్టీ పేరుని కూడా ప్రకటించారు. ఆ మీదట అభిమానులతో వరస మీటింగ్స్ నిర్వహించారు. ఇలా సాగుతున్న రజనీ కాంత్ రాజకీయ ప్రయాణం ఒక్కసారిగా ఆయనే ఆపేశారు. అనారోగ్య కారణాలు చూపించి తాను రాజకీయాల్లోకి రాదలచుకోలేదని ఆయన చెప్పి అభిమానులకు ప్రజలకు కూడా బిగ్ షాక్ ఇచ్చేశారు. అలా రజనీ రాజకీయ ప్రయాణం ఇంకా మొదలు కాకుండానే ఎండ్ కార్డు పడినట్లు అయింది.

కమల్ ఉత్సాహం సైతం :

ఇక మరో టాప్ హీరో విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల మీద మక్కువతో 2019 ఎన్నికల్లో లోక్ సభకు సొంతంగా పోటీ చేశారు. ఆయన కోయంబత్తూరు నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే ఓటమి వరించింది. ఆ తరువాత తమ పార్టీ మక్కల్ నీది మయ్యం ని ప్రకటించి 2021 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసినా ఫలితం చేదుగా వచ్చింది. దీంతో ఇక లాభం లేదని ఆయన తన పార్టీని డీఎంకేకి మిత్ర పక్షంగా మార్చి గత ఏడాది రాజ్యసభకు వెళ్ళారు. ఆ విధంగా కమల్ పొలిటికల్ ఎంట్రీ ఆయన ఉత్సాహం అన్నీ కూడా ఎంపీ వరకూ మాత్రమే పరిమితం అయిపోయాయి. ఏ మాత్రం తమిళనాడులో ప్రభావం చూపించలేకపోయాయి.

తరువాత తరంలో :

తమిళనాడులో ప్రజల చేత ఆరాధ్య కథానాయకులుగా పేరు తెచ్చుకున్న రజనీ కాంత్ కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయంగా వెనక్కి వెళ్ళిన నేపథ్యంలో తరువాత తరం నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టి జనం ముందుకు వచ్చారు. ఆయన టీవీకే పేరుతో 2024 ఫిబ్రవరి 2న పార్టీని స్థాపించారు. రెండు బలమైన ద్రవిడ పార్టీలను ఆయన ఢీ కొట్టారు. అంతే కాదు తన కొత్త పార్టీని ప్రజల వద్దకు తీసుకుని వచ్చి అనూహ్య విజయం అందుకున్నారు. ఇపుడు తమిళనాడుకు ఒక సినీ హీరో సీఎం అవుతారు అని నిరూపించారు. ఇది ఎంజీఆర్ జయలలిత తరువాత వారసత్వాన్ని కొనసాగించిన ఘనతగా కూడా విజయ్ ని చూసిన వారు అంటున్నారు. విజయ్ లో క్లాస్ అండ్ మాస్ హీరో ఉన్నారు, అందుకే అటు రజనీ ఇటు కమల్ ఇద్దరూ చేయలేని ఫీట్ ని సాధించి తమిళనాడులో సరికొత్త రాజకీయ చరిత్రను సృష్టించారు అని అంటున్నారు. దటీజ్ విజయ్ అని ఆయన అభిమానులు అంతా కొనియాడుతున్నారు అంటే సాధించింది మామూలు విక్టరీ కాదు కదా.