Begin typing your search above and press return to search.

విజయసాయి చేరే పార్టీ ఏంటో చెప్పేశారా ?

ఇక రెడ్డి జాతి గురించి కూడా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. రెడ్డి జాతి ద్వేషించే జాతి కాదని ప్రపంచాన్ని ప్రేమించే జాతి అని అన్నారు.

By:  Satya P   |   2 Feb 2026 11:58 PM IST
విజయసాయి చేరే పార్టీ ఏంటో చెప్పేశారా ?
X

విజయసాయిరెడ్డిని ప్రస్తుతానికి మాజీ రాజకీయ నాయకుడు అనాలి. ఎందుకంటే ఆయనే చెప్పినట్లుగా ఏడాది క్రితం రాజకీయ విరామం తీసుకున్నారు. రైతుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఇక తాజాగా చూస్తే ఆయన తాను రాజకీయాల్లో క్రియాశీలం అవుతాను అని చెప్పారు. అంతే కాకుండా తొందరలోనే ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వస్తాను అని ఊరించారు. కానీ ఆయన చేరే పార్టీ ఏమిటన్నది అయితే చెప్పలేదు, కానీ లేటెస్ట్ గా ఆయన ఒక సామాజిక వర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక పేరు చెప్పలేదు కానీ చేరబోయే పార్టీ బహుశా అదే అని అంతా ఊహించుకుంటున్నారు.

హిందూ ధర్మం అంటూ :

విజయసాయిరెడ్డి తాజాగా రెడ్డి సామాజిక వర్గం సమావేశంలో మాట్లాడుతూ దేశం గురించి ధర్మం గురించి గట్టిగానే చెప్పారు. అంతే కాదు హిందూ ధర్మాన్ని ప్రతీ ఒక్కరూ కాపాడుకోవాల్సి ఉందని ఆయన అన్నారు దేశం మీద భారత సంస్కృతి మీద గత కొన్ని శతాబ్దాలుగా దాడి జరుగుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల మన దేశం మన సంస్కృతిని కాపాడుకోవాల్సి ఉందని ఆయన పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా ఈ బాధ్యత రెడ్ల మీదనే ఎక్కువగా ఉందని అన్నారు.

బీజేపీ పడికట్టు పదాలే :

అయితే హిందూత్వం ధర్మం అన్నవి బీజేపీ పడి కట్టు పదాలుగా అంతా చూస్తున్నారు. విజయసాయిరెడ్డికి బీజేపీతో కేంద్ర పెద్దలతో ఎంతో సాన్నిహిత్యం ఉందని అంటారు. ఇపుడు ఆయన నోట ఈ మాటలు రావడం అంటే భవ్యిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయిపోయిందా అన్న చర్చ అయితే సాగుతోంది. విదేశీయుల పాలన పోయినా భారతీయ సంస్కృతి మీద దాడులు మాత్రం ఆగడం లేదని కూడా ఆయన అన్నారు. దేశంలో అంతర్గత కలహాలు సృష్టిస్తున్న శక్తుల పట్ల రెడ్డి సామాజిక వర్గం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరడమూ విశేషం.

రెడ్డి జాతి గురించి :

ఇక రెడ్డి జాతి గురించి కూడా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. రెడ్డి జాతి ద్వేషించే జాతి కాదని ప్రపంచాన్ని ప్రేమించే జాతి అని అన్నారు. సమాజంలో విభజనను భిన్నత్వంలో ఏకత్వంగా భావించలేమని ఆయన అన్నారు. మతమే గొప్ప అనే వారు దేశంలో కొంత మంది ఉన్నారని, పాకిస్థాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ జరిగితే తమ మతం గెలవాలని కోరుకునే వారు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సంస్కృతిని ఎవరూ ప్రోత్సహించరాదని అన్నారు. పహల్గాం లో అమాయకులను రాజకీయాలతో సంబంధం లేని వారిని చంపారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

భారత్ కోసం అంతా :

ఇక దేశంలోనూ పొరుగు దేశాల్లోనూ హిందువుల మీద జరుగుతున్న దాడులు కూడా విజయసాయిరెడ్డి వరసగా ప్రస్తావించారు. భారత్ భవిష్యత్తులో ఒక ఆఫ్ఘనిస్తాన్ గా పాకిస్తాన్ గా మారకుండా ఉండాలీ అంటే మత మార్పిడులను అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. హిద్నూ ధర్మం అంతరించి పోకుండా చూడాలని ఆయన కోరారు. ఈ బాధ్యతను అంతా ముందుకు తీసుకుని వెళ్ళాలని విజయసాయిరెడ్డి కోరారు.

కాషాయ భావజాలంతో :

ఇక విజయసాయిరెడ్డి దాదాపుగా పదిహేను నిముషాలకు పైగా చేసిన ప్రసంగంలో ఎక్కువగా బీజేపీ భావజాలమే కనిపించింది అని అంటున్నారు. ఆయనకు కూడా బీజేపీ అంటే ఇష్టమే అన్న అభిప్రాయం ఉంది. మోడీ ప్రభుత్వం పట్ల తన ప్రేమను ఆయన ఎప్పటికపుడు తెలియచేస్తూ వస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ప్రసంగాన్ని విశ్లేషించిన వారు అంతా బీజేపీ వైపుగా విజయసాయిరెడ్డి అడుగులు పడుతున్నాయా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తనకు మద్దతుగా కూడగట్టే పనిలో ఆయన ఉన్నారా అదే ఆయన అసలైన వ్యూహమా అన్నది కూడా మరో చర్చగా ఉంది. మొత్తానికి విజయసాయిరెడ్డి కమలం పార్టీ దిశగానే సాగుతున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఈ మాటలకు ఆయన రేపటి చర్యలకు మధ్య లింక్ ఏ విధంగా ఉండబోతోందో.