జగన్ అధికారంలోకి రారు...ఇట్లు మాజీ విధేయుడు
ఇక విజయసాయిరెడ్డి జగన్ విషయంలో మరో మాట అన్నారు. తాను ఏ రోజూ జగన్ ని విమర్శించలేదని చెబుతూనే జగన్ మాత్రం తనను విమర్శించారు అని కాస్తా ఆగ్రహంగానే చెప్పారు.
By: Satya P | 22 Jan 2026 10:33 PM ISTవైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని వైసీపీ నేతలు ఒక వైపు అంటూంటే జగన్ కి ఇక అధికారం కల్ల అని ఏకంగా ఆయన ఒకనాటి సన్నిహితుడే అంటున్నారు. ఈ మాజీ విధేయుడు జగన్ కి అధికారం దక్కదు అని బరాబర్ గా తేల్చి చెబుతున్నారు. జగన్ వైఖరి మార్చుకోవాలని మరోసారి ఆయన సూచిస్తూనే జగన్ మీద వేయాల్సిన సెటైర్లు వేశారు.
అది జరిగితేనే తప్ప :
జగన్ అధికారంలోకి రావాంటే రెండు జరగాలని రాజకీయ వ్యూహకర్త కూడా అయిన విజయసాయిరెడ్డి అంటున్నారు. ఒకటి జగన్ తన చుట్టూ కోటరీని తెంచుకుని బయటపడాలని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అంతే కాదు కూటమి చీలిపోతేనే జగన్ కి అధికారం దక్కుతుదని అంటున్నారు. ఒకటి జగన్ చేతిలో ఉండొచ్చు. ఆయన కోటరీని పక్కన పెట్టి బయటకు రావచ్చు కానీ కూటమిని విడగొట్టడం అన్నది ఆయన చేతిలో లేదు, వారికి వారే విడిపోవాలి. అది జరిగే పని కాదని ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీలు స్పష్టంగా చెప్పేశాయి. సో అందుకే జగన్ కి మళ్ళీ అధికారం దక్కదని విజయసాయిరెడ్డి చెబుతున్నారు అనుకోవాలి.
ఎన్ని పాదయాత్రలు చేసినా :
జగన్ రానున్న కాలంలో ఎన్ని పాదయాత్రలు చేసినా ఫలితం ఉండదని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన తన తీరు మార్చుకోవాలని అన్నారు. రాజకీయ ప్రణాళికలను రూపొందించుకోవాలని ఒక విధానం ప్రకారం ముందుకు సాగాలని ఒకనాటి మాజీ విధేయుడు విజయసాయిరెడ్డి సూచించారు.
జగన్ విమర్శల మీద :
ఇక విజయసాయిరెడ్డి జగన్ విషయంలో మరో మాట అన్నారు. తాను ఏ రోజూ జగన్ ని విమర్శించలేదని చెబుతూనే జగన్ మాత్రం తనను విమర్శించారు అని కాస్తా ఆగ్రహంగానే చెప్పారు. తాను ప్రలోభాలకు లొంగి పదవికి రాజీనామా చేశాను అని జగన్ అన్నారని దానిని ఆయన వెనక్కి తీసుకోవాలని విజయసాయిరెడ్డి గట్టిగా కోరారు. తాను ఎవరి దగ్గరా ఒక పైసా చేయి చాచి తీసుకోలేదని అన్నారు. తాను పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశాను అన్నారు. తానే కనుక ప్రలోభాలకు లొంగితే లక్షల కోట్లు సంపాదించేవాడిని అని ఆయన అన్నారు. ఇది నిజం అన్నారు.
జగన్ కి పాలేరుగా :
తాను జగన్ కి పాలేరుగా పనిచేస్తూ వచ్చాను అన్నారు. తాను జగన్ ఏ పని చెప్పినా చిత్తశుద్ధితో చేశాను అన్నారు. తాను చంద్రబాబుని విమర్శించే విషయంలో ఎందాకైనా వెళ్లాను అని అది తనకు ఉన్న విధేయత అని చెప్పారు. కానీ జగన్ మాత్రం తనను పొమ్మనకుండా పొగ పెట్టారని ఆయమ మండిపడ్డారు. తన చుట్టూ ఉన్న కోటరీ మాటలు విని జగన్ ఇదంతా చేశారు అన్నారు. ఈ రోజుకీ పంది కొక్కుల్లా జగన్ చుట్టూ కోటరీ నేతలు ఉన్నారని ఆయన ఫైర్ అయ్యారు. జగన్ వారిని అలా చూస్తూ ఉన్నారని విజయసాయిరెడ్డి అన్నారు.
లిక్కర్ స్కాం లో :
ఇదిలా ఉంటే లిక్కర్ స్కాం విషయంలో తనకు సంబంధం లేదని ఈడీ ముందు చెప్పాను అని ఆయన అన్నారు. ఎవరికి సంబంధం ఉందో వారి విషయం కూడా ఈడీకి వివరాలు ఇచ్చాను అన్నారు. తాను చెప్పిన వాటిని కొన్ని ఈడీ అధికారులు రికార్డు చేసుకున్నారు అని ఆయన చెప్పారు. ప్రాంతీయ పార్టీలలో నంబర్ టూ ఎవరూ ఉండరని తాను నంబర్ టూ వైసీపీలో కానని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు.
రాజకీయాల్లోకి ఖాయం :
తనను విమర్శిస్తున్న జగన్ అలాగే తనను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుల విషయంలో తాను తట్టుకుని ముందుకు సాగాలంటే కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని తాను వస్తాను అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ నుంచి అన్నాది తొందరలోనే చెబుతాను అని ఆయన అన్నారు. అది జనసేననా లేక బీజేపీనా ఏది అన్నది పూర్తి వివరాలు అపుడే ఇస్తాను అని విజాయ్సాయిరెడ్డి చెప్పడం విశేషం. పదిహేనేళ్ల పాటు వైసీపీలో తాను పనిచేశాను కానీ చివరికి జగన్ ఈ విధంగా తనకు కానుక ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
