విజయ్ రూపానీ మృతి... బీజేపీకి గుజరాత్ లో గట్టి దెబ్బ
ఆరెస్సెస్ నుంచి ఎదిగిన నాయకుడిగా నిబద్ధత నిజాయితీ కలిగిన నేతగా పాలనా దక్షునిగా పేరున్న వారు విజయ్ రూపానీ.
By: Tupaki Desk | 13 Jun 2025 9:04 AM ISTఆరెస్సెస్ నుంచి ఎదిగిన నాయకుడిగా నిబద్ధత నిజాయితీ కలిగిన నేతగా పాలనా దక్షునిగా పేరున్న వారు విజయ్ రూపానీ. ఆయన పార్టీకి కట్టుబడిన వారు. అందుకే సీఎం గా చేయమంటే గద్దెనెక్కారు. జనరంజకంగా పాలించారు. అయినా సరే కొన్ని రాజకీయ సమీకరణల వల్ల ఆయనని దిగిపోమంటే దిగిపోయారు. అలా ఆయన బీజేపీకి గట్టి విశ్వాసపాత్రునిగా ఉన్నారు.
ఆయన గుజరాత్ మాజీ సీఎం గా ఉంటూ పార్టీని బలమైన వెన్నెముకగా ఉన్నారు అలాంటి ఆయన తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. దాంతో మరో రెండేళ్లలో గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆయన లేని లోటు గట్టి దెబ్బ అని అంటున్నారు.
ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. జనసంఘ్ కాలం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. అతను 1988 నుండి 1996 వరకు రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా పనిచేశారు. అలాగే 1996 నుండి 1997 వరకు రాజ్‌కోట్ మేయర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇక గుజరాత్ అసెంబ్లీకి 1998లో ఎన్నికయ్యారు. 2002, 2007, 2012, 2017, 2022లలో తిరిగి ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక అనూహ్యంగా ఆయన 2016లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉంది అనగా 2021లో అతను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్నారు.
ఇక ఆయన మాజీ సీఎం అయినా సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. 2027లో గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి. గత మూడున్నర దశాబ్దాలుగా గుజరాత్ బీజేపీ చేతులలో ఉంది. ఈసారి చూస్తే యాంటీ ఇంకెంబెన్సీ ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆప్ లాగేసుకోవడం వల్ల బీజేపీ లాభపడింది. ఈసారి ఆప్ పోటీ చేయదని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ కి మంచి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు
మోడీ అమిత్ షా ఇద్దరూ గుజరాత్ కి చెందిన వారు. అక్కడ గెలుపు చాలా ముఖ్యం. అలాంటి తరుణంలో కీలక నేత సీఎం స్థాయి వ్యక్తి దుర్మరణం పాలు కావడం బీజేపీకి ఎంతో రాజకీయ నష్టం అని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీని సేవ చేస్తూ విలువలకు కట్టుబడి ఉన్న విజయ్ రూపానీ లాంటి నాయకులను తిరిగి తెచ్చుకోవడం ఆయన ప్లేస్ భర్తీ చేయడం కష్మని అంటున్నారు.
ఒక వైపు రాహుల్ గాంధీకి గుజరాత్ పర్యటనలలో జనాదరణ పెరుగుతోంది. అదే సమయంలో బీజేపీకి గుజరాత్ లో నాయకులు చాలా అవసరం పడుతున్నారు. ఇంతటి కీలక వేళ మాజీ సీఎం బీజేపీ వరిష్ట నేత విజయ్ రూపాని దుర్మరణం పాలు కావడం కమలనాధులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్త తెలిసి రాజ్ కోట్ లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున వస్తున్న ప్రజలను ఆదరణను చూస్తే విజయ్ రూపాని నాయకత్వం ఏమిటి అన్నది అర్ధమవుతుంది అంటున్నారు.
