Begin typing your search above and press return to search.

అమ్మకు అత్యంత నమ్మకస్తుడు.. విజయ్ కు అంత సన్నిహితుడెలా?

తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్ ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Garuda Media   |   2 Jun 2026 2:46 PM IST
అమ్మకు అత్యంత నమ్మకస్తుడు.. విజయ్ కు అంత సన్నిహితుడెలా?
X

తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్ ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనూహ్య రీతిలో అధికారాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. ప్రభుత్వాన్ని ఆయన నడిపిస్తున్న తీరు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విజయ్ కు అత్యంత నమ్మకస్తుడిగా.. వ్యక్తిగత జ్యోతిష్యుడిగా వ్యవహరిస్తున్న రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఇప్పుడు మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఎవరిని పెద్దగా దగ్గరకు తీయని సీఎం విజయ్.. రాధన్ పండిట్ ను మాత్రం అత్యంత సన్నిహితంగా వ్యవహరించటమే కాదు.. ఆయన మాటకు విలువ ఇవ్వటం కనిపిస్తుంది. తాజాగా ఆయన్ను రాజ్యసభకు పంపుతారన్న ఊహాగానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ రాధన్ పండిట్ ను నియమించుకున్న సీఎం విజయ్.. ఆ నియామకంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగానే.. ప్రభుత్వం విడుదల చేసిన ఆయన నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకోవటం తెలిసిందే. అలాంటి ఆయన్ను మళ్లీ ఇప్పుడు రాజ్యసభకు పంపేందుకు వీలుగా సీఎం విజయ్ నిర్ణయం తీసుకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సీవీ షణ్ముగం రాజీనామా చేయటంతో ఆయన స్థానం ఖాళీ అయ్యింది. తమిళనాడు అసెంబ్లీలో అత్యధిక సీట్లు ఉన్న విజయ్ పార్టీకి.. ఈ రాజ్యసభ సీటు దక్కే అవకాశం సంపూర్ణంగా ఉంది. దీంతో.. తన వ్యక్తిగత జ్యోతిష్యుడ్ని రాజ్యసభ సభ్యుడిగా చేయటానికి అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఎక్కువ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. రాధన్ పండిట్ గురించి ఆరా తీస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మొదలు.. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అద్వానీ లాంటి వారికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన ట్రాక్ రికార్డు ఉన్న ఈ పెద్ద మనిషి వయసు ఎంత? అన్న ప్రశ్నకు మాత్రం సూటి సమాధానం లభించకపోవటం గమనార్హం.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ విజయం సాధిస్తారన్న విషయాన్ని మెజార్టీ మీడియా సంస్థలు అంచనా వేయలేకపోయాయి. కానీ.. ఆ విషయాన్ని ఎన్నికలకు చాలాకాలం ముందే.. రాధన్ పండిట్ అంచనా వేయటమే కాదు.. తమిళనాడు రాజకీయాల్లో ఆయనో ప్రభంజనంగా మారతారన్న విషయాన్ని బల్లగుద్ది చెప్పిన మొదటి వ్యక్తిగా ఇతన్ని చెప్పాలి. ఇలాంటి అంచనాలు ఇప్పుడే కాదు దాదాపు ముప్ఫై ఏళ్లకు ముందు.. జయలలిత విషయంలోనూ చెప్పి ఆమెకు సలహాదారుగా మారారు. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత సాధించిన చారిత్రాత్మక విజయాన్ని కచ్ఛితంగా అంచనా వేయటంతో ఆమెకు అత్యంత ఆఫ్తుడిగా మారారు. అనంతరం అంతర్గత సలహాదారుగా వ్యవహరించారు.

జయలలితకు ఆయన ఎంత నమ్మకస్తుడిగా మారారంటే.. ఆమె రాజకీయ భవిష్యత్తు మరింత దివ్యంగా ఉండాలంటే పేరులో మార్పు అవసరమని చెబితే..అందుకు తగ్గట్లే జయలలిత చివర్లో ఇంగ్లిషు అక్షరంలో మరో ‘ఎ’ను చేర్చుకునేందుకు ఆమె వెనుకాడలేదు. ఆమెకు పదవీ గండం ఉంటుందని.. జైలుకు వెళ్లే ముప్పు ఉందని చెప్పినప్పుడు తొలుత నమ్మలేదు. అంతేకాదు.. అశుభం పలుకుతారా? అంటూ ఆయన్ను దూరం పెట్టేశారు. అయితే.. ఆయన అంచనా నిజమై ఎన్నికల్లో ఓడిపోవటమే కాదు అరెస్టు కావటంతో మరోసారి ఆమె వ్యక్తిగత జ్యోతిష్యుడిగా మారారు. అయితే.. 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లరని రాధన్ పండిట్ అంచనా వేయటం.. అందుకు భిన్నంగా ఆమెకు జైలుశిక్షపడటంతో ఆయన అంచనా తప్పించి.. అమ్మకు పూర్తిగా దూరమయ్యారు

మధ్యలో ఒకసారి జయలలిత దూరం పెట్టిన సమయంలో ఆయన చెన్నైను వదిలిని ఆయన కొంతకాలం సింగపూర్ లోనూ.. ఆ తర్వాత ముంబైలోనూ షిప్టు అయ్యారు. ముంబయిలో సినీ నటి మనీషా కోయిరాలా.. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ జగదీష్ కపూర్ లాంటి ప్రముఖులకు తన జ్యోతిష్యం ద్వారా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఢిల్లీకి షిప్టు అయి తన పేరును రాధన్ పండిట్ గా మార్చుకున్నారు. హిందీ రాని ఆయన తనకున్న ఇంగ్లిషు ప్రావీణ్యంతో నెట్టుకొచ్చారు. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అద్వానీకి సన్నిహితంగా.. కీలక సలహాదారుగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం తర్వాత మరోసారి తమిళనాడు రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు.

నటుడు విజయ్ తమిళనాడు సీఎం అవుతారని.. ఆయన జాతకం సునామీ లాంటిదని.. ఆయన సీఎం అవుతారని 2024లోనే లెక్క కట్టిన ఆయన.. ఆ విషయాన్ని బహిరంగ వేదికలపైనా చెప్పటంతో.. విజయ్ ను ఆకర్షించారు. తమిళనాడులో తనకున్న రాజకీయ పరిచయాలతో విజయ్ సన్నిహితుల వరకు వెళ్లిన ఆయన.. తాను అనుకున్నది సాధించారు. సాధారణంగా ఎవరిని పెద్దగా దగ్గరకు తియ్యని విజయ్ సైతం.. రాధన్ పండిట్ ను తన నమ్మకస్తుల జాబితాలో చేర్చుకోవటం చూస్తే.. ఆయన ఎంతలా ప్రభావితం చేస్తారన్న విషయం అర్థమవుతుంది. విజయ్ పెట్టిన రాజకీయ పార్టీకి తమిళగ వెట్రి కజగం పేరును డిసైడ్ చేసింది కూడా ఆయనే. సంఖ్యా శాస్త్రాన్ని అనుసరించి పెట్టిన పేరు సూపర్ హిట్ కావటంతో విజయ్ కు ఆయన అత్యంత సన్నిహితంగా మారారు

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున విజయ్ కు అనుకూలంగా ఫలితాలు వస్తున్న వేళలో.. ఆయన్ను కలిసిన మొదటి వ్యక్తి రాధన్ పండిట్ మాత్రమే. ఈ కారణంగానే మిగిలిన అంశాల్ని పట్టించుకోకుండా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ లాంటి అత్యున్నత అధికారిక పదవిని ఇచ్చి గౌరవించారు. మిత్రపక్షాల నుంచి మాత్రమే కాదు విపక్షం నుంచి వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గిన విజయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎంత వేగంగా నిర్ణయం తీసుకున్నారో.. విమర్శ వచ్చినంతనే వెనకడుగు వేయటం ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చిన పరిస్థితి. అలా అని.. రాధన్ పండిట్ కు ఏదో విధంగా గౌరవ పదవిని కట్టబెట్టాలన్న ఆలోచనలో విజయ్ ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వ సలహాదారు పదవిని కేటాయించటంపై తీవ్ర విమర్శలే కాదు..ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు కావటంతో విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాజ్యసభ పదవి అయితే పూర్తిగా రాజకీయం కావటం.. పార్టీ అంతర్గత నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి.. ఈ నిర్ణయంపై పెద్దగా విమర్శలు రావన్న మాట వినిపిస్తోంది. చట్టపరమైన చిక్కులు కూడా ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ద్రవిడ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏమవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఒకసారి రాధన్ పండిట్ విషయంలో విమర్శలు వెల్లువెత్తటంతో వెనక్కి తగ్గిన విజయ్.. మళ్లీ అదే తరహాలో నిర్ణయం తీసుకుంటారా? లేదంటే.. విమర్శలకు కొంతకాలం వెనక్కి తగ్గుతారా? అన్నది కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పాలి.