కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ షాక్.. రాజీవ్ హంతకులపై సీఎం విజయ్ వైఖరి.. ఇంట్రెస్టింగ్!
ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ వర్ధింతి సందర్భంగా సంతాపం తెలియజేస్తూ తమిళనాడు సీఎం విజయ్ ‘ఎక్స్’లో చేసిన ప్రకటన రాజకీయంగా కలకలం రేపుతోంది.
By: Tupaki Political Desk | 19 May 2026 12:04 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న పనితీరుతో ఆకట్టుకుంటున్న విజయ్.. తాజాగా చేసిన పనితో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేక సతమతమవుతున్న టీవీకే పార్టీకి భేషరుతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఊహించని పరిణామంపై ఎలా స్పందించాలో కూడా తేల్చుకోలేని పరిస్థితి ఎదుర్కొంటోందని అంటున్నారు. కాంగ్రెస్ అంతలా ఇబ్బంది పడే పరిస్థితి ఏంటి? అంటే దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతుకుల విషయంలో సీఎం విజయ్ చేసిన ప్రకటనే అంటున్నారు.
ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ వర్ధింతి సందర్భంగా సంతాపం తెలియజేస్తూ తమిళనాడు సీఎం విజయ్ ‘ఎక్స్’లో చేసిన ప్రకటన రాజకీయంగా కలకలం రేపుతోంది. ‘‘మేము ముల్లివైక్కల్ జ్ఞాపకాలను మా హృదయాలలో పదిలపరుచుకుంటాము. సముద్రం అవతల నివసిస్తున్న మా తమిళ బంధువుల హక్కుల కోసం మేము ఎల్లప్పుడూ సంఘీభావం తెలియజేస్తూనే ఉంటాము’’ అంటూ విజయ్ ట్వీట్ చేశారు. తమిళుల విషయంలో విజయ్ చేసిన ప్రకటనపై ఎవరికీ అభ్యంతరం లేకపోయినప్పటికీ, ఉగ్రవాద నాయకుడైన ప్రభాకరన్ రాజీవ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కావడంతో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలిందని అంటున్నారు.
పొరుగు దేశం శ్రీలంకలో తమిళల కోసం పోరాడిన ఎల్టీటీఈని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్టీటీఈని మన దేశం నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. శ్రీలంక సైన్యం దాడులతో ఆ సంస్థ నామరూపాల్లేకుండా పోయింది. ఇదే క్రమంలో 2009 మే 18న శ్రీలంక సైతన్యం చేతిలో ప్రభాకరన్ హతమయ్యాడు. ఆయన వర్ధంతి సందర్భంగా తమిళనాడు సీఎం హోదాలో విజయ్ సంతాపం తెలియజేయడమే చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.
శ్రీలంకలో తమిళుల విషయంలో తమిళనాడుకు చెందిన కొన్నిపార్టీలు సానుభూతి చూపుతుంటాయని అంటున్నారు. ఈ క్రమంలోనే కొన్నిపార్టీలు తమిళ ఈలం అనుకూల వాదనలు వినిపిస్తుంటాయని చెబుతున్నారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న విడుదలై చిరుతైగళ్ కట్చి (వీసీకే) కూడా ఎల్టీటీఈ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుంటుందని అంటున్నారు. ఈ కోణంలో తమిళలకు సంఘీభావం చెప్పడంలో తప్పేమీ లేకపోయినప్పటికీ ఉగ్రవాద నాయకుడి విషయంలో తమిళనాడు సీఎం విజయ్ వ్యవహరించిన తీరే కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని విధంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
