టీవీకే విజయ్ ని చూసి...బాబు రేవంత్ కి ఇబ్బందేనా ?
అదేంటి ఎక్కడో తమిళనాడులో వచ్చిన రాజకీయ మార్పు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కలకలం రేపుతుందా అంటే రాజకీయాలలో ఏదైనా సాధ్యమే.
By: Satya P | 5 May 2026 11:30 PM ISTఅదేంటి ఎక్కడో తమిళనాడులో వచ్చిన రాజకీయ మార్పు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కలకలం రేపుతుందా అంటే రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. ఎక్కడ ఏది జరిగినా దాని ప్రకంపనలు అంతటా ఉంటాయి. అలా చూస్తే తమిళనాడులో విజయ్ అప్రతిహత విజయం మాత్రం తెలుగు రాష్ట్రాలని సైతం గురి చూసి షేక్ చేసే అవకాశాలు లేకపోలేదు అన్నది విశ్లేషకుల మాట. ఇక దక్షిణ భారత దేశంలోనే విజయ్ సాధించిన ఈ తరహా విజయం అతి పెద్ద చర్చగా మారుతోంది. ఆయన విజయంతో చాలా సమీకరణలు ట్రెడిషనల్ పాలిటిక్స్ కి చెక్ పడినట్లు అవుతోందని అంటున్నారు.
యాంటీ గవర్నమెంట్ పాలిటిక్స్ :
తమిళనాడులో విజయ్ విజయాన్ని అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. అందులో అత్యంత కీలకమైనది ఏంటి అంటే యాంటీ గవర్నమెంట్ పాలిటిక్స్. ప్రభుత్వం అయిదేళ్ళ పాటు పనిచేసిన తరువాత సహజంగా వచ్చే వ్యతిరేకత. దాని స్థాయి ఎంత ఏమిటి అన్నది చూస్తే గతంలో ఒక మాదిరిగా ఉండేది. కానీ సరైన ఆల్టర్నేషన్ ఉంటే మాత్రం అది విశ్వరూపం దాలుస్తుంది అన్నదే విజయ్ విక్టరీ వెనక చెప్పే సారాంశం. స్టాలిన్ అయిదేళ్ల పాలన మరీ అంత బాగా లేదు అని ఎవరూ అనరు. అయితే ప్రతీ ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. అయితే దానికి క్యాష్ చేసుకునే బలమైన ప్రత్యర్థి ఉంటే కుర్చీ ఎగిరిపోవడం ఖాయమని స్టాలిన్ ఉదంతం రుజువు చేస్తోంది.
సౌత్ లో సైతం :
ఇక కేవలం తమిళనాడులో మాత్రమే ఈ రకమైన యాంటీ గవర్నమెంట్ పాలిటిక్స్ లేదు. కేరళలో అది బీభత్సంగా పనిచేసింది. అందుకే అక్కడ యూడీఎఫ్ సీట్ల నంబర్ లో సెంచరీ మార్క్ దాటేసి మరీ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇలా రెండు కీలక రాష్ట్రాలు పొరుగునే ఉన్న తమిళనాడు కేరళలో అధికార మార్పు చాలా జోరుగా సైలెంట్ గా జరిగిపోయింది. కేరళలో కూడా ఎల్డీఎఫ్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బాగానే పాలించారు. కానీ విజయన్ వద్దు అనుకున్నారు. మార్పు కోసం ఓటు వేశారు. ఫలితంగా అక్కడ యూడీఎఫ్ గెలిచింది. ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఉంటే ఎలా జరుగుతుందో ఈ రెండు రాష్ట్రాలు నిరూపించాయి. దాంతో తెలుగు రాష్ట్రాలలో కూడా దీని మీద అతి పెద్ద చర్చ సాగుతోంది.
కొత్తదనం కోసం :
రొటీన్ పాలిటిక్స్ ని కొత్త తరం వద్దు అంటోంది. వారంతా సోషల్ మీడియాకు బాగా కనెక్ట్ అయి ఉన్న వారు. అందుకే వారు నూతనత్వం తాజాదనం ఉన్న రాజకీయాన్ని కోరుతున్నారు. ఒకప్పుడు అనుభవం కావాలి అని ఓటు చేసేవారు. ఇపుడు ఫ్రెష్ లుక్ తో ఉండే వారికి పట్టం కడుతున్నారు. దానికి ఉదాహరణ తమిళనాడులో విజయ్. రాజకీయంగా కేవలం రెండేళ్ల అనుభవం. ఎమ్మెల్యే కూడా చేయలేదు, నేరుగా సీఎం అవుతున్నారు. దానిని బట్టి చూస్తే కొత్త తరం ఆలోచనలు శర వేగంగా మారుతున్నాయని భావించాలి. ఎక్కడ అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి యువత వ్యతిరేకంగానే పనిచేస్తారు అని తాజా పరిణామాలు ఫలితాలు రుజువు చేస్తున్నాయి. దాంతో ఎవరైనా జాగ్రత్త పడాల్సిందే అని అంటున్నారు. మనకేమిలే అని బేఫికర్ గా ఉంటే ఇబ్బందులే అని అంటున్నారు.
బాబు ప్లస్ రేవంత్ :
ఏపీలో చంద్రబాబు తెలంగాణాలో రేవంత్ అధికారంలో ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా ముఖ్యమంత్రులుగా తమ పాలనను రెండేళ్ళకు పైగా పూర్తి చేసుకున్నారు. ఇంకా చేతిలో సగం పాలన ఉంది. అయితే యూత్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి వారి సమస్యల పట్ల ఇప్పటి నుంచే తగినంత శ్రద్ధ పెట్టి పనిచేయాల్సి ఉందని అంటున్నారు. యువతరం ప్లస్ జెన్ జీ కలిస్తే ఉప్పెన సునామీ అన్నీ ఎదురొచ్చినట్లే అని అంటున్నారు. సో ఈ ఫలితాలు తెలుగు నాట కూడా ఒక సీరియస్ గా పరిశీలించాల్సిన విషయమే అని అంటున్నారు.
