Begin typing your search above and press return to search.

జననాయగన్.. ఆగిపోవడమే మంచిదైందా?

రాజకీయాల్లోకి వెళ్లే ముందు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ చేసిన చివరి చిత్రం.. జననాయగన్. ఇది తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ కాగా అందులో రాజకీయాల ప్రస్తావన ఏమీ ఉండదు.

By:  Tupaki Desk   |   4 May 2026 1:10 PM IST
జననాయగన్.. ఆగిపోవడమే మంచిదైందా?
X

రాజకీయాల్లోకి వెళ్లే ముందు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ చేసిన చివరి చిత్రం.. జననాయగన్. ఇది తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ కాగా అందులో రాజకీయాల ప్రస్తావన ఏమీ ఉండదు. కానీ దర్శకుడు హెచ్.వినోద్ అండ్ టీమ్ మాత్రం విజయ్‌కి రాజకీయ ప్రయోజనం చేకూర్చేలా ఇందులో అనేక సన్నివేశాలు, డైలాగులు జోడించారు. ఈ విషయం ‘జననాగయన్’ ప్రోమోల్లో క్లియర్‌గా కనిపించింది. ఈ సినిమా ద్వారా తమిళ జనాల్లో ఒక ఆలోచన రేకెత్తించి, ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలుచుకోవాలని విజయ్ భావించాడన్నది స్పష్టం. కానీ అతడి ఆశలకు బ్రేక్ వేస్తూ.. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయలేదు. దీంతో జనవరి 9కి అనుకున్న సినిమా కాస్తా.. ఇప్పటిదాకా రిలీజే కాలేదు. ఎలాగైనా ఎన్నికల కంటే ముందే సినిమాను రిలీజ్ చేసి, జనాలకు విజయ్ ఈ సినిమా ద్వారా ఇవ్వాలనుకున్న సందేశాన్ని వాళ్లకు చేరేలా చూడాలని నిర్మాత ఎంతో ప్రయత్నించాడు. కానీ అది సాధ్యపడలేదు.

ఎన్నికలు ముగిశాక కూడా కొంత ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. చివరికి ఇప్పుడు తమిళనాట ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. విజయ్ పార్టీ టీవీకే ఏకంగా అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తోంది. విజయ్ సీఎం కావడం లాంఛనమే. కాబట్టి అతి త్వరలో ‘జననాయగన్’ థియేటర్లలోకి దిగబోతోంది. ఇక ఏ శక్తీ ఆ సినిమాను ఆపబోదు. ఐతే ఒక రకంగా ‘జననాయగన్’ రిలీజ్ ఆగిపోవడం విజయ్‌కి మేలే చేసిందేమో అన్న చర్చ కూడా జరుగుతోంది ఇప్పుడు. ఆ సినిమా చూసి జనం ఏ మాత్రం ప్రభావితం అయ్యేవారో కానీ.. రిలీజ్ ఆగిపోవడం వల్ల విజయ్ మీద కావాల్సినంత సానుభూతి వచ్చింది. పైగా ఈ సినిమా ఆన్ లైన్లో లీక్ అయిపోవడంతో సానుభూతి ఇంకా పెరిగింది. ఒంటరిగా ఎన్నికల్లో పోరాడుతున్న విజయ్‌కి వ్యతిరేకంగా కుట్రల్లో భాగంగానే ‘జననాయగన్’‌కు సెన్సార్ సమస్యలు, లీక్ అని నమ్మిన జనం అతడికి మరింత మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా యూత్‌లో ఈ భావన పెరగడం విజయ్‌కి అడ్వాంటేజీగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడిక విజయ్ అభిమానుల విజయోత్సవ సంబరాల్లో ‘జననాయగన్’ రిలీజ్ కూడా ఒకటి కాబోతోంది. ఆ సినిమాను ఫ్యాన్స్ ఏ రేంజిలో సెలబ్రేట్ చేస్తారో చెప్పేదేముంది?