దళపతి విజయ్ తల్లిదండ్రులకూ ఒక స్టోరీ ఉంది !
విజయ్ తమిళనాడులో ఈ రోజున టీవీకే పార్టీ అధినేతగా నిలిచి గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నారు.
By: Tupaki Desk | 4 May 2026 7:00 PM ISTవిజయ్ తమిళనాడులో ఈ రోజున టీవీకే పార్టీ అధినేతగా నిలిచి గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే ఆయన సినీ రాజకీయ ప్రస్థానం వెనక సామాజిక పరమైన ఆవగాన ఆయనలో కలగడం వెనక తల్లి దండ్రుల పాత్ర చాలా ఉంది. విజయ్ తల్లిదండ్రులు కూడా తమిళ సినీ రంగంతో అనుబంధం ఉన్న వారే. వారికీ ఒక స్టోరీ ఉంది. వారి వెనక ఎన్నో విజయాలు ఉన్నాయి. విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో 1981లో చట్టంతో పోరాటం అన్న సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా మొదట తమిళంలో తీసి ఆయన విజయం అందుకున్నారు ఈ సినిమాకు స్టోరీ అందించింది ఎవరో కాదు విజయ్ తల్లి చంద్రశేఖర్ సతీమణి శోభ. ఆమె గురించి కూడా చెప్పుకోవాల్సింది చాలా ఉంది.
గాయని, నిర్మాత దర్శకురాలు :
శోభ మంచి గాయని. ఆమె ఒక నిర్మాత కుమార్తె. ఇక చంద్రశేఖర్ సినీ రంగంలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చినపుడు ఆ నిర్మాత దగ్గరకు తరచూ వెళ్ళేవారు. అలా శోభతో పరిచయం ఏర్పడి అది ప్రేమ వివాహానికి దారి తీసింది. ఇక శోభ మంచి కధలను రాసి అందిస్తే వాటిని సినిమాలుగా తీసి చంద్రశేఖర్ తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. అలా తీసిన సినిమావే చట్టానికి కళ్ళు లేవు. ఈ మూవీ కధను శోభ అందించారు. అయితే సినిమాగా తీయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రశేఖర్ ఎంతో శ్రమించి తానే దర్శకత్వం వహించి తీశారు అలా తమిళ్ లో హిట్ అయితే తెలుగులో అపుడే హీరోగా ఎదుగుతున్న చిరంజీవికి ఇది మంచి సూపర్ హిట్ ని అందించి కెరీర్ కి ఎంతగానో మేలు చేసింది. ఇక చంద్రశేఖర్ శోభ ఇద్దరూ విజయ్ ని హీరోగా పెట్టి సినిమాలు తీయడమే కాదు దర్శకత్వం కూడా చేశారు. తన కొడుకు సినిమాలకు శోభ కధలు అందించారు. ప్రొడ్యూస్ చేశారు.
హీరోగా చూడాలని :
ఇక చంద్రశేఖర్ శోభ దంపతులకు విజయ్ 1974 జూన్ 22న పుట్టారు. సరిగ్గా పదేళ్ళకు 1984లో విజయ్ ని చంద్రశేఖర్ బాల నటుడిగా వెండి తెరకు పరిచయం చేశారు. 1992లో అంటే విజయ్ కి 18 ఏళ్ళ టీనేజ్ లో ఉండగానే హీరోగా పెట్టి చంద్రశేఖర్ సినిమా తీశారు. అలా తొలి హిట్ కొట్టిన విజయ్ 2024 వరకూ అంటే దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి తమిళనాడులో దళపతిగా అభిమాన జనం ప్రేమను అందుకున్నారు. విజయ్ చేసిన సినిమాలలో సామాజిక స్పృహ ఉంటుంది. అలాగే రాజకీయ నేపథ్యం తో కూడిన సినిమాలు ఆయన అనేకం చేశారు. అవే ఆయనను జనానికి దగ్గరగా చేశాయి అని చెప్పాలి. విజయ్ లో కూడా మొదటి నుంచి సామాజిక అంశాల పట్ల అవగాహన ఉంది అంటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆయన్ని ఆ విధంగా తీర్చి దిద్దారు అని అంటారు.
తొలి అభిమానిగా :
ఇక విజయ్ కి ఈ ప్రపంచంలో తొలి అభిమాని పెద్ద అభిమాని ఎవరో కాదు ఆయన తల్లి శోభ. విజయ్ ప్రతీ సినిమా ఆమె చూసి మెచ్చుకుంటారు, విజయ్ ని రాజకీయాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించడంలో తల్లిదండ్రుల ఇద్దరి పాత్ర చాలా ఉంది. చంద్రశేఖర్ అయితే అభ్యుదయ భావాలతో కూడిన సినిమాలు ఎన్నో నిర్మించారు. ఆయన సినిమాలు సమాజంలో చైతన్యాన్ని రేకెత్తించేలా ఉండేవి. ఇవన్నీ కలసి విజయ్ ని ఈ రోజున ఒక రాజకీయ పార్టీ అధినేతగా కాబోయే సీఎం గా మార్చాయని చెప్పాల్సి ఉంది.
