తమిళ నాట విజయ్ దండయాత్ర.. వారంలో రెండు రోజులు ప్రజల మధ్యకు దళపతి
తమిళ సూపర్ స్టార్.. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత దళపతి విజయ్ జోరు పెంచారు.
By: Tupaki Desk | 14 Sept 2025 6:00 PM ISTతమిళ సూపర్ స్టార్.. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత దళపతి విజయ్ జోరు పెంచారు. గత ఏడాది ఫిబ్రవరిలో కొత్త పార్టీ ప్రారంభించిన విజయ్.. తిరుచ్చి నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టారు. పార్టీ ప్రారంభించిన సుమారు 20 నెలల తర్వాత జనం మధ్యకు వచ్చారు విజయ్. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్న దళపతి ఇకపై ప్రతివారంలో రెండు రోజులు బస్సు యాత్ర నిర్వహించి పార్టీకి బలమైన పునాది వేయాలని భావిస్తున్నారు. శనివారం తిరుచ్చిలో ప్రారంభమైన బస్సు యాత్ర పెరంబలూర్, అరియలూర్ జిల్లాల్లో కొనసాగనుంది.
గతంలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించారు దళపతి విజయ్. ఆ రెండు ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమయ్యాయి. గత నెలలో నిర్వహించిన పార్టీ మహానాడుకు దాదాపు 5 లక్షల మంది తరలిరావడం సంచలనంగా మారింది. తాజాగా ప్రారంభమైన బస్సుయాత్రకు కూడా జనం పోటెత్తారు. దాదాపు రెండు లక్షల మంది వచ్చి ఉంటారని ఓ అంచనా. దీంతో తమిళ నాట విజయ్ పార్టీ కొత్త సంచలనాలకు తెరతీస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.
తమిళనాడులో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే మధ్యే దశాబ్దాలుగా రాజకీయ పోరాటం జరుగుతోంది. మధ్యలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినా.. అవేవీ నిలదొక్కుకోలేదు. రాజకీయ మనుగడ కోసం ఆ రెండు పక్షాల్లో ఏదో ఒకదాని పక్షాన చేరాల్సివచ్చింది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో విజయ్ ఏ పక్షం కాకుండా స్వతంత్రంగా రాజకీయం చేయాలని భావించడమే ఆసక్తికరంగా మారింది. విజయ్ కన్నా సినీ రంగంలో సీనియర్లు అయిన సూపర్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల హాసన్ కూడా రాజకీయంగా తమిళనాటలో చెప్పుకోదగ్గ విజయాలు లేవని అంటున్నారు. రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని ఒక సారి ప్రకటించిన రజినీ కాంత్ రోజుల వ్యవధిలోనే తన ఆలోచనను విరమించుకున్నారు. ఇక తాజాగా రాజ్యసభకు ఎన్నికైన కమలహాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు సాధించలేకపోయారు. చివరికి గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే కు జైకొట్టి.. ఇప్పుడు ఆ పార్టీ మద్దతుతో ఎంపీ అయ్యారు.
ఇక తమిళనాట కెప్టెన్ గా ఖ్యాతి గడించిన దివంగత నటుడు విజయ్ కాంత్ కూడా చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఎంజీఆర్, జయలలిత మాదిరిగా సినీ రంగం నుంచి వచ్చి తమిళ రాజకీయాలను శాసించడం ఇప్పటి తరానికి కుదరదా? అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజయ్ ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా కనిపిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గత ఏడాది పార్టీ పెట్టిన విజయ్.. ఇప్పటివరకు రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించలేకపోయారు. ఇప్పుడు కూడా వారంలో రెండు రోజులే బస్సు యాత్ర చేస్తానంటున్నారు. దీనివల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం, పార్టీని విస్తరించడం సాధ్యమా? అనే చర్చ జరుగుతోంది.
మరోవైపు దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకేని ఎదిరించేలా రాజకీయం చేస్తానంటున్న విజయ్ పార్టీని నడపడంలో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. తిరుచ్చిలో నిర్వహించిన రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు. అయితే మైకులు సరిగా లేకపోవడం, ఆయన ఏం మాట్లాడుతున్నారో స్పష్టత లేకపోవడం, అభిమానులు రభసకు దిగడం వంటివి గందరోగళంగా మారాయని అంటున్నారు. తొలిసారి జనం మధ్యకు వచ్చిన విజయ్ రానున్న రోజుల్లో ఈ సవాళ్లను అధిగమించాల్సివుందని అంటున్నారు.
