బాబు పవన్ విజయ్ ఒకే ఫ్రేమ్...ఏపీకి తమిళ సీఎం !
ఏపీకి తమిళనాడుకు మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించుకునే నిమిత్తం విజయ్ ఏపీకి వస్తున్నారు అని అంటున్నారు.
By: Satya P | 10 Oct 2026 3:44 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత విజయ్ తొలిసారి ఏపీకి అధికార పర్యటనకు వస్తున్నారు. ఆయన ఈ నెల 13న విజయవాడ టూర్ ఫిక్స్ అయిందని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో భేటీ అవుతారు అని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు గంగ ఒప్పందం గురించి ఆయన కూటమి ప్రభుత్వంలో చర్చిస్తారు అని అంటున్నారు. అలాగే కృష్ణా జలాల వాటా గురించి చర్చ కూడా ఈ భేటీలో జరగనుంది అని అంటున్నారు.
జల వివాదాలే అజెండా :
ఏపీకి తమిళనాడుకు మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించుకునే నిమిత్తం విజయ్ ఏపీకి వస్తున్నారు అని అంటున్నారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా తమిళనాడుకు నీటిని సరఫరా చేసే ఒప్పందం గతంలో కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ నుంచి ప్రతీ ఏడాది 12 టీఎంసీల క్రిష్ణా జలాల నీటిని తమిళనాడుకు అందించాల్సి ఉంది. అయితే ఆ ఒప్పందం సక్రమంగా అమలు కావడం లేదన్నది తమిళనాడు అభ్యంతరంగా ఉంది. ఈ ఏడాది చూస్తే అక్టోబర్ 9 నాటికి కేవలం 2.251 టీఎంసీల నీరు మాత్రమే అందిందని చెబుతున్నారు. ఇంకా 9.749 టీఎంసీల నీరు తమిళనాడుకు సరఫరా కావాల్సి ఉంది. దాంతో తమకు ఒప్పందం మేరకు రావాల్సిన పూర్తి వాటా 12 టీఎంసీల నీటి కోసం తమిళ సీఎం విజయ్ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చిస్తారు అని అంటున్నారు.
డ్యాముల నిర్మాణం మీద :
అంతే కాకుండా ఏపీ నుంచి తమిళనాడులోకి ప్రవహించే నదుల మీద ఏపీ ప్రభుత్వం డ్యాముల నిర్మాణం చేసేందుకు సిద్ధపడుతోంది అన్న దానిమీద కూడా తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం తెలియచేస్తోంది. ఈ విషయం మీద ముఖా ముఖీ చర్చల ద్వారా ఏపీ ప్రభుత్వంతో ఒక పరిష్కారం కనుగొనాలని విజయ్ చూస్తున్నారు అని అంటున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తరచూ ఒక మాట అంటున్నారు. కేంద్రం వద్ద కూడా ప్రతిపాదిస్తున్నారు. అదే నదుల అనుసంధానం. గోదావరి కావేరి సహా దక్షిణాది నదులు అన్నీ కూడా ఏకీకృతం చేస్తే కనుక దక్షిణాదిన అతి పెద్ద వాటర్ గ్రిడ్ ఏర్పడుతుందని శాశ్వతంగా అన్ని రాష్ట్రాలకు నీటి కొరత తీరుతుందని కూడా బాబు చెబుతున్నారు. దీని మీద కూడా విజయ్ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చిస్తారు అని అంటున్నారు. ఏపీ తమిళనాడు ముఖ్యమంత్రుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా అనేక అంతర రాష్ట్ర సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని భావిస్తున్నారు. అంతే కాదు రెండు రాష్ట్రాల మధ్య సానుకూల వైఖరితో పాటు మంచి సంబంధాలు నెలకొనేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.
పవన్ తో తొలిసారి :
ఇదిలా ఉంటే ఏపీకి వస్తున్న విజయ్ ఉప ముఖ్యమంత్రి పవన్ తో తొలి భేటీ వేస్తారు అని అంటున్నారు. చంద్రబాబు ఈ మధ్య దక్షిణాది రాష్ట్రాల సమావేశం చెన్నైలో జరిగినపుడు వెళ్ళారు. అక్కడ అలా విజయ్ ని ఆయన కలుసుకున్నారు. పవన్ తో విజయ్ భేటీ అయితే జరగలేదు. దాంతో ఈసారి ఈ ఇద్దరూ కలసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు అని అంటున్నారు. ఈ ఇద్దరికీ ఒక పోలిక ఉంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఒకరు ముఖ్యమంత్రిగా మరొకరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. దాంతో ఈ నెల 13న విజయ్ జరిపే అధికారిక పర్యటన మీద అందరి కళ్లూ ఉన్నాయి.
