Begin typing your search above and press return to search.

వియత్నాంలో బోటు బోల్తా.. 15 మంది మృతి.. మృతుల్లో ఏపీ వాసులు

మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

By:  A.N.Kumar   |   11 July 2026 5:53 PM IST
వియత్నాంలో  బోటు బోల్తా.. 15 మంది మృతి.. మృతుల్లో ఏపీ వాసులు
X

వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులకు ఊహించని విషాదం ఎదురైంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో భారతీయులు ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌బోటు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

మృతుల్లో ఏపీ డిస్ట్రిబ్యూటర్లు.. ఒడ్డున ఉండి బతికిన మరో వ్యక్తి

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అధికారులు గుర్తించారు. కడప జిల్లాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయశ్రీ ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాగా కడపకే చెందిన నయీం అనే మరో మొబైల్ డిస్ట్రిబ్యూటర్ ప్రమాద సమయంలో బోటు ఎక్కకుండా ఒడ్డునే ఉండిపోవడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

మొబైల్ కంపెనీ టూర్.. అసలేం జరిగింది?

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒక ప్రముఖ మొబైల్ సంస్థ తమ భారతీయ డిస్ట్రిబ్యూటర్లు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ వియత్నాం విహార యాత్రను ఏర్పాటు చేసింది. ఈ టూర్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 250 మంది పాల్గొన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 35 మంది, తెలంగాణకు చెందిన వారు 40 మంది ఉన్నారు. పర్యటనలో భాగంగా పర్యాటకులను మూడు వేర్వేరు బోట్లలో సముద్ర విహారానికి తీసుకెళ్లారు.

మధ్యాహ్నం సమయంలో 'హాన్ మే రుట్' ప్రాంతం నుంచి 'అన్ థోయ్ పోర్టు' వైపు 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బందితో ఒక స్పీడ్‌బోటు బయల్దేరింది. అయితే తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలోకి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా బోటు అదుపుతప్పి సముద్రంలో తలకిందులైంది. దీంతో బోటులోని వారంతా నీటిలో మునిగిపోయారు.

వాతావరణ మార్పే కారణమా?

వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం, సముద్రంలో అలల ఉద్ధృతి తీవ్రం కావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానిక అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ఇతర పర్యాటక బోట్ల సిబ్బంది స్పందించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోటు పూర్తిగా తలకిందులు కావడం, అలల వేగం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ పలువురిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మరికొందరు ఇంకా గల్లంతవడంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రంగంలోకి భారత రాయబార కార్యాలయం

ఈ దారుణ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య, అత్యవసర సహాయాన్ని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక రెస్క్యూ బృందాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యుల సమాచారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.