Begin typing your search above and press return to search.

శంకరాచార్యులవారిపై చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

కొన్ని విషయాల గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో వందల ఏళ్ల క్రితం చోటు చేసుకున్న అంశాలను మాట్లాడే సమయంలో ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాలి.

By:  Garuda Media   |   9 Feb 2026 2:52 PM IST
శంకరాచార్యులవారిపై చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

కొన్ని విషయాల గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో వందల ఏళ్ల క్రితం చోటు చేసుకున్న అంశాలను మాట్లాడే సమయంలో ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాలి. చరిత్ర.. ఆధారాలుగా కొన్ని వందల ఏళ్ల నుంచి

చెప్పే అంశాలకు భిన్నమైన వాదనను వినిపించే ముందు.. తమ వాదన దానికి ఆధారంగా తమ లాజిక్ తో పాటు.. దానికి ముందున్న అంశాలను లింక్ చేయటం తప్పనిసరి. అందుకు భిన్నంగా చరిత్రను వక్రీకరించేలా మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. విమర్శల జడివానలో తడిచి ముద్దవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శించి చినజీయర్ స్వామి చిక్కుకున్నారని చెబుతున్నారు.

ఇటీవల హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇంతకూ ఆయన ఏమన్నారంటే? ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించి.. చినజీయర్ స్వామి ఏమన్నారో చెబుతాం. ఆయన మాటల్నియథాతధంగా చెబితే.. కాస్తంత అర్థం కానట్లుగా ఉంటుంది. అందుకే ఆయన మాటల్ని కాస్తంత సరళం చేసి.. అలా అని అర్థం మారకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నది మర్చిపోవద్దు.

- శంకారాచార్యులవారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు. నాలుగు దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారు. ఈ పీఠాలు పూరీ జగన్నాథంలో.. ద్వారకలో.. జ్యోతిర్మఠంలో.. శృంగేరిలో ఒకటని చెబుతుంటారు. ఈ నాలుగు మఠాలు.. వాటిని శంకరాచార్యువారు ఏర్పాటు చేయలేదు

- 32 ఏళ్ల వయసులో ఆయన ఉత్తర భారతానికి వెళ్లారు. హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అందువల్ల ఆయన వచ్చి మళ్లీ మఠాల్ని ఏర్పాటు చేయటం అనేది సరైనది కాదు. ఎవరు ఏర్పాటు చేశారు?

- 13వ శతాబ్దంలో మన విజయనగర మహా సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలకు మార్గదర్శకంగా ఉండేవారు విద్యారణ్య స్వామి. ఆయన ఎవరంటే.. వేద భాష్యాలను రచించిన మహా పండితుడు. వేదాంత దేశికుల వారికి సహాధ్యాయి (క్లాస్ మేట్)

- ఆయనే విజయనగర మహాసామ్రాజ్యాన్ని.. ఈ నాలుగు పీఠాల్నీ. పంచాయతనాన్ని పరిచయం చేసింది కూడా ఆయనే. ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు (విష్ణువు ఆజ్ఞలకు కట్టుబడి ఉండేవాడు). శుద్ధ వైష్ణవుడాయన. అద్వైత తత్వం (జీవాత్మ, పరమాత్మ వేర్వేరు కాదని రెండు ఒక్కటేనని బోధించేది). కానీ.. ఆయన ఉత్తమ వైష్ణవుడు.

- భగవద్గీతకు.. బ్రహ్మసూత్రాలకు.. ఉపనిషత్తులకు.. ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి, స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టుంటుంది.

- అక్కడక్కడా రామానుజుల వారు కాస్త మొహమాటపడి సర్వేశ్వరేశ్వర: అని వాడుతుంటారు. కానీ.. శంకరాచార్యుల వారికి అలాంటి మొహమాటాలేవీ లేవు. తన భాష్యాల్లో (తన వివరణలో) నారాయణ:.. వాసుదేవ:.. విష్ణు:.. అంటూ స్పష్టంగా చెప్పేస్తారాయన.

- అప్పటికే మన దేశాన్ని విదేశీయులు అక్రమించటం ప్రారంభమైంది. వారిని ఎదుర్కోవటానికి అందరూ కలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో విద్యారణ్యుల వారు అన్ని మార్గాల్లో ఉండేవారందరిని (శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం)కలిపాలన్నది ఆయన ఉద్దేశం. ఇందుకు ఆయన పంచాయతనాన్ని పరిచయం చేశారు.

ఇలా చెప్పిన చినజీయర్ స్వామి వారి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదం కావటానికి.. ఆయన చెప్పిన మాటలు చరిత్రను.. దానికి సంబంధించిన ఆధారాల్ని తప్పుగా చెప్పటమేనన్నది ప్రధాన విమర్శ. అందుకు ఉదాహరణగా చెప్పాల్సి వస్తే..13వ శతాబ్దంలో విద్యారణ్యులవారు చతురామ్నాయ పీటాల్ని ఏర్పాటు చేశారని చినజీయర్ స్వామి చెప్పారు. కానీ.. నాలుగు పీఠాల్లో ఒకటైన శృంగేరి పీఠానికి విద్యారణ్యుల వారు 12వ గురువు కావటం గమనార్హం.

ఆయన 1380 నుంచి 1386 వరకు శృంగేరి పీఠానికి అధిపతిగా ఉన్నారు. ఆయనకు ముందు విద్యారణ్యులవారి తమ్ముడు భారతీ తీర్థ 1333 నుంచి 1380 వరకు పదకొండో పీఠాధిపతిగా ఉన్నారు. చరిత్ర ఇలా ఉంటే అందుకు భిన్నంగా విద్యారణ్యస్వామే చతురామ్నాయ పీఠాల్ని ఏర్పాటు చేశారని చినజీయర్ స్వామి ఎలా చెబుతారంటూ పలువురు తప్పు పడుతున్నారు. మరి.. తాను చెప్పిన మాటలకు భిన్నంగా చరిత్ర.. ఆధారాలు ఉన్నప్పుడు వాటికి ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.