Begin typing your search above and press return to search.

వీరప్పన్ కూతురుకు బీజేపీ ఎంపీ టికెట్?

ఈ నేపథ్యంలోనే 2024 లోక్ సభ ఎన్నికలలో ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 March 2024 3:28 PM GMT
వీరప్పన్ కూతురుకు బీజేపీ ఎంపీ టికెట్?
X

గంధపు చెక్కల స్మగ్లింగ్ తో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ గురించి దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేదు. వీరప్పన్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు సమాజంలో చాలా రోజులపాటు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీరప్పన్ చనిపోయిన కొద్ది సంవత్సరాలపాటు అతడి కుటుంబం దాదాపు అజ్ఞాతంలో గడిపింది. అయితే, తండ్రి వల్ల తనకు వచ్చిన చెడ్డ పేరును తుడిచి పెట్టేలా వీరప్పన్ కూతురు విద్యా రాణి లాయర్ గా, సామాజిక కార్యకర్తగా మారింది.

ఏనుగు దంతాల స్మగ్లింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్, హత్యలు వంటి దుశ్చర్యలతో అపకీర్తి మూట కట్టుకున్న వీరప్పన్ కూతురు పేదవాళ్ళకి పాఠశాలలు నిర్మించడం వంటి కార్యక్రమాలతో సామాజిక కార్యకర్తగా కీర్తి గడిచింది.

ఈ నేపథ్యంలోనే 2024 లోక్ సభ ఎన్నికలలో ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని తెలుస్తోంది. అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న విద్యా రాణి ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా, రాజకీయ వేత్తగా మారారు. 2020లో బిజెపిలో చేరిన విద్యారాణి తమిళనాడు బీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా నియమితురాలయ్యారు.

2021 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు. ఈ క్రమంలోనే పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం 2024 ఎన్నికలలో ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆరేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి, ఆ తర్వాత తండ్రి ఉనికి వల్ల తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న విద్యారాణి సంఘంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది.