Begin typing your search above and press return to search.

ఏపీ పోలీసులతో పోరాడిన విడదల రజినీ.. వైరల్ వీడియో

ఈ ఘటనపై వైయస్సార్సీపీ నాయకులు స్పందిస్తూ పోలీసుల తీరును ఖండించారు. మహిళా మాజీ మంత్రి పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

By:  Tupaki Desk   |   11 May 2025 6:16 AM
ఏపీ పోలీసులతో పోరాడిన విడదల రజినీ.. వైరల్ వీడియో
X

వైయస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని ఆంధ్రప్రదేశ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కారులో ప్రయాణిస్తున్న తన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని అడ్డుకునే క్రమంలో రజిని పోలీసులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు.

పోలీసులు విడదల రజిని వాహనాన్ని అడ్డుకొని శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అసలు ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారని రజిని పోలీసులను గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన రజిని కారు దిగి, డోర్ బలంగా వేసి, తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను దాదాపుగా తోసేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అరెస్ట్ చేయడానికి సరైన కారణం చెప్పాలని నిలదీశారు. అరెస్ట్‌ను అడ్డుకుంటే తనపై కూడా కేసు నమోదు చేయాల్సి వస్తుందని ఒక అధికారి హెచ్చరించగా, "చేసుకోండి చూద్దాం ఏం చేస్తారో" అంటూ రజిని సవాల్ విసిరారు. చివరకు పోలీసులు విడదల రజినిని పక్కకు తప్పించి, కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, విడదల రజిని రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. 2019 ఎన్నికలకు ముందు ఆమె వైయస్సార్సీపీలో చేరారు. చిలకలూరిపేట నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఆమె పదవీకాలంలో అనేక వివాదాలు తలెత్తాయి. ప్రస్తుతం ఆమెపై ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఒక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలపై నమోదైన ఈ కేసులో రజిని ఏ1 నిందితురాలిగా ఉండగా, ఆమె బావమరిది గోపినాథ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఇటీవల రజినిని ఆదేశించింది. ఇలాంటి సమయంలో అనుచరుడి అరెస్ట్ విషయంలో పోలీసులతో ఆమె వ్యవహరించిన తీరు ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఘటనపై వైయస్సార్సీపీ నాయకులు స్పందిస్తూ పోలీసుల తీరును ఖండించారు. మహిళా మాజీ మంత్రి పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మరోవైపు, టీడీపీ శ్రేణులు విడదల రజిని పోలీసులపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ వైరల్ అవుతున్న వీడియోను ప్రచారం చేస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డిని ఏ కేసులో అరెస్ట్ చేశారనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.