ఒక యుద్ధం మొదలు.. ఒక యుద్ధం విరామం.. మోదీ రష్యా టూర్ రద్దు
ఈ విక్టరీ డేకు ఈసారి అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. దీనిని మోదీ కూడా అంగీకరించారు.
By: Tupaki Desk | 30 April 2025 5:00 PM ISTవిక్టరీ డే.. రష్యా చరిత్రలో అత్యంత ముఖ్యమైనది.. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా ఏటా మే 9న ఈ విక్టరీడేని నిర్వహిస్తుంటుంది. ఉక్రెయిన్ పై మూడేళ్ల కిందట ప్రారంభించిన యుద్ధాన్ని.. విక్టరీ డే సందర్భంగా ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ మూడు రోజుల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని తెలిపింది.
ఈసారి విక్టరీ డేకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది రష్యా చరిత్రలో 80వది. 1945 నుంచి జరుపుకొంటున్న ఈ విక్టరీ డేకు ఈసారి అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. దీనిని మోదీ కూడా అంగీకరించారు.
అయితే, గత వారం కశ్మీర్ లోని పెహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ అయింది. పాక్ జాతీయులను పంపించేయడం, ఆ దేశం వారికి వీసాల రద్దు వంటి ఎన్నో చర్యలు చేపట్టింది. మరోవైపు ప్రధాని మోదీ అనేక ఉన్నతస్థాయి చర్చల్లో పాల్గొంటున్నారు. అఖిలపక్ష సమావేశం, కేంద్ర కేబినెట్ భేటీలు, త్రివిధ దళాధిపతులు, సీడీఎస్, జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమయ్యారు. చివరగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
అటు పాకిస్థాన్ కూడా రాగల 36 గంటల్లో తమపై దాడి జరగొచ్చని అంచనా వేస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో మోదీ రష్యా పర్యటన రద్దు చేసుకున్నారు.
సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణం అని స్పష్టం అవుతోంది. విక్టరీ డే మే 9న మాస్కో రెడ్ స్క్వేర్ లో భారీ సైనిక కవాతు నిర్వహిస్తారు. ప్రతిసారి దీనికి మిత్ర దేశాల అధినేతలను పుతిన్ ఆహ్వానిస్తుంటారు. ఆసారి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు పిలుపు అందింది. జిన్ పింగ్ హాజరుకావడం ఖరారైంది.
ఒకవేళ ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్.. పాకిస్థాన్ పై చర్యకు దిగితే... అది ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. మరోవైపు పుతిన్ మాత్రం ఉక్రెయిన్ పై యుద్ధానికి మూడు రోజుల విరామం ఇచ్చారు. అంటే ఒక యుద్ధం ఆగితే మరో యుద్ధం మొదలైంది.
