Begin typing your search above and press return to search.

ఓడినా.. గౌరవప్రద మార్గమేనా?

ప్రధానంగా వైసీపీ, బిజేడీ, అవామీ లీగ్, ఎంఐఎం వంటి పార్టీలు ఈ సారి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Aug 2025 12:19 PM IST
ఓడినా.. గౌరవప్రద మార్గమేనా?
X

ఉపరాష్ట్రపతి ఎన్నికల వాతావరణం దేశ రాజకీయాల్లో విశేష చర్చనీయాంశమైంది. ఇండియా కూటమి తరఫున పోటీలోకి దిగిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం ప్రతిపక్షాలు విస్తృతంగా కసరత్తులు చేస్తున్నాయి. తమ కూటమి సభ్య పక్షాలతోపాటు, ఎన్డీయే కూటమిలోని కొంతమంది మిత్రపక్షాలు, అలాగే తటస్థంగా ఉన్న పార్టీలను ఆకర్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది.

ఆ పార్టీలు కీలకం కాబోతున్నాయా?

ప్రధానంగా వైసీపీ, బిజేడీ, అవామీ లీగ్, ఎంఐఎం వంటి పార్టీలు ఈ సారి కీలక పాత్ర పోషిస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. కాంగ్రెస్ తమ శత్రువని చెప్పిన జగన్, ప్రత్యక్షంగా ఎన్డీయేకు మద్దతు తెలిపినట్లే వ్యవహరించారు. దీంతో సుదర్శన్ రెడ్డికి వైసీపీ మద్దతు దొరకడం కష్టమైంది. ఇక, ఒడిశాలో న‌వీన్ పట్నాయ‌క్ నేతృత్వంలోని బిజేడీ బహిరంగంగా తటస్థంగా ఉన్నప్పటికీ, రాజకీయ సమీకరణాలు, కేంద్ర ప్రభావం కారణంగా ఎన్డీయేకు దగ్గరగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఆ పార్టీల విషయంలో అప్రమత్తం

అవామీ లీగ్ పార్టీ దాదాపు ఇండియా కూటమి పక్షానే ఉన్నప్పటికీ, బీజేపీ చురుకైన ప్రయత్నాలు చేస్తుండటంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని ఎంఐఎం పార్టీ విషయంలోనూ అనిశ్చితి నెలకొంది. ఎంఐఎం బీజేపీకి బీ పార్టీగా పనిచేస్తుందనే అభిప్రాయం ఉండటంతో, చివరి క్షణంలో అది ఎన్డీయే వైపు మొగ్గు చూపే అవకాశముందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఈ కారణంగా ఎంఐఎం మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరించింది. రాష్ర్టంలో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పలుమార్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. రాష్ర్టంలో కాంగ్రెస్ కు ఎంఐఎం పరోక్ష సహకారం అందిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ ఉప రాష్ర్టపతి ఎన్నిక విషయంలో ఎంఐఎం తమ వైపు మొగ్గు చూపుతుందా లేదా అనే సంశయం కాంగ్రెస్ లో నెలకొంది.

ఓడినా గౌరవప్రద స్థానంలోనే..

అన్ని ప్రయత్నాలు విఫలమై సుదర్శన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోతే, ఆయన గౌరవాన్ని కాపాడే ప్రయత్నం తప్పదని కాంగ్రెస్ భావిస్తోంది. ఖర్గే నేతృత్వంలోని బృందం ఆయనను రాజ్యసభకు పంపించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే, గెలుపు లేకపోయినా ఓటమిని గౌరవప్రదంగా మార్చే దిశగా వ్యూహరచన జరుగుతోంది.