ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్!
దేశ రెండో పౌరుడు ఉపరాష్ట్రపతి. రాజ్యాంగబద్ధమైన ఈ పదవిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా భర్తీ చేస్తారు.
By: Tupaki Desk | 25 July 2025 3:13 PM ISTదేశ రెండో పౌరుడు ఉపరాష్ట్రపతి. రాజ్యాంగబద్ధమైన ఈ పదవిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా భర్తీ చేస్తారు. దీనికి సంబంధించి శుక్రవారం.. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికల కు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా.. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ను నియమించినట్టు పేర్కొంది. అదేవిధంగా రాజ్యసభ సచివాలయానికి చెందిన జాయింట్ సెక్రటరీ గరిమా జైన్, డైరెక్టర్ విజయకుమా ర్‌లను కూడా.. ఎన్నికల పర్యవేక్షకులు, సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించింది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సూచనల మేరకు.. కేంద్ర న్యాయ శాఖతో చర్చించిన తర్వాత.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం.. రాజ్యసభ చైర్మన్, దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి దఖలు పడింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ చేసినట్టు సంఘం తెలిపింది.
ఎలా నిర్వహిస్తారు?
ఉపరాష్ట్రపతి ఎన్నికలు రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. దామాషా ప్రాతినిధ్య వ్యవస్థను అనుసరిస్తుంది. ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు సభ్యులు మాత్రమే ఉంటారు. ఎన్నికైన, నామినేటెడ్ లోక్‌సభ సభ్యులు(543 మంది ఎన్నికైనవారు, ఇద్దరు నామినేట్ చేయబడినవారు), రాజ్యసభ సభ్యులు (233 మంది ఎన్నికైనవారు, 12 మంది నామినేట్ చేయబడినవారు), మొత్తం 790 మంది ఓటర్లుగా వ్యవహరిస్తారు. వీరు ఉపరాష్ట్రపతి బ్యాలెట్ విధానంలో ఎన్నుకుంటారు.
నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు నిర్దేశించిన ఫారం 3 లో దాఖలు చేయాలి. ప్రతి నామినేషన్‌కు కనీసం 20 మంది ప్రతిపాదకులు, 20 మంది మద్దతుదారులు సంతకాలు చేయాలి. వీరందరూ ఎంపీలు అయి ఉండాలి. ఒక అభ్యర్థికి ఒకే ఎంపీ ఒకటి కంటే ఎక్కువసార్లు మద్దతు ఇవ్వకూడదు. 15,000 సెక్యూరిటీ డిపాజిట్ నామినేషన్‌తో పాటు నగదు రూపంలో లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ముందస్తుగా డిపాజిట్ చేయాలి. అభ్యర్థులు నాలుగు నామినేషన్ పత్రాల వరకు సమర్పించవచ్చు.
