Begin typing your search above and press return to search.

ఉప రాష్ట్రపతిగా జేడీయూ నేత..? 6 నెలల్లోగా ఎన్నిక అనివార్యం!

సీనియర్ నేత జగదీప్ ధన్ ఖర్ రాజీనామాతో కాబోయే ఉప రాష్ట్రపతి ఎవరు అన్న చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   22 July 2025 9:00 PM IST
ఉప రాష్ట్రపతిగా జేడీయూ నేత..? 6 నెలల్లోగా ఎన్నిక అనివార్యం!
X

సీనియర్ నేత జగదీప్ ధన్ ఖర్ రాజీనామాతో కాబోయే ఉప రాష్ట్రపతి ఎవరు అన్న చర్చ మొదలైంది. ఎన్డీఏ కూటమి పార్లమెంటు ఉభయ సభల్లో సంపూర్ణ ఆధిక్యం ఉండటంతో మళ్లీ బీజేపీ, దాని మిత్రపక్షాలు మద్దతు ఉన్నవారే ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉప రాష్ట్రపతిగా 2022 ఆగస్టు 11న బాధ్యతలు స్వీకరించిన ధన్ ఖడ్ తన పదవీకాలం పూర్తి కాకుండానే వైదొలిగారు. ఆయనకు 2027 ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉన్నా, అనారోగ్య కారణాలు అంటూ ఆయన ఆకస్మికంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా మారింది.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు ఖాళీ ఏర్పడినప్పుడు నియమావళి ప్రకారం ఆరు నెలల్లోగా కొత్త వారిని ఎన్నుకోవాల్సివుంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి రాజీనామాతో కొత్తవారిని ఎన్నుకునే వరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఇన్ చార్జి చైర్మన్ గా వ్యవహరిస్తారు. అంటే తాత్కాలికంగా ఉప రాష్ట్రపతి బాధ్యతలను కూడా ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ వ్యవహరించనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూకి చెందిన హరివంశ్ రాజకీయాల్లో చాలా సీనియర్. దీంతో ఆయనే ఉప రాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడికి అవకాశం ఇచ్చారు. ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత బెంగాల్ గవర్నర్గా ఉన్న జగదీప్ దన్ ఖడ్ కు ప్రమోషన్ ఇచ్చారు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే సమయంలో ఆయన కేంద్రమంత్రిగా ఉండేవారు. దీంతో ఇప్పుడు కూడా కేంద్ర మంత్రులు లేదా సీనియర్ గవర్నర్లలో ఎవరో ఒకరిని ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేరుపైనే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నూతన ఉప రాష్ట్రపతి ఎంపికపై కమలదళంలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది చివర్లో బిహార్ లో ఎన్నికలు ఉండటం వల్ల ఆ రాష్ట్రానికి చెందిన హరివంశ్ పేరును వ్యూహాత్మకంగా ఎంపిక చేయాలన్న అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోందని అంటున్నారు. అంతేకాకుండా ఉప రాష్ట్రపతి పదవీకాలం మరో రెండేళ్లు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేబదులు డిప్యూటీ చైర్మన్ కే అవకాశం ఇవ్వాలని సూచనలు వస్తున్నాయంటున్నారు. ఏదిఏమైనా జేడీయూ నేత హరివంశ్ కాబోయే ఉప రాష్ట్రపతి అంటూ దేశ రాజధానిలో ప్రచారం జరుగుతోంది.