అపాయింట్ మెంట్ తీసుకోకుండా వెళ్లి రాష్ట్రపతి చేతికి రాజీనామా లేఖ
పదవీకాలం ఉన్నప్పటికి అనూహ్య రీతిలో ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్ ఖడ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే.
By: Tupaki Desk | 24 July 2025 9:39 AM ISTపదవీకాలం ఉన్నప్పటికి అనూహ్య రీతిలో ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్ ఖడ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన చెబుతున్నప్పటికీ.. అసలు కారణం అదేమీ కాదని.. మోడీషాల కారణంగానే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే.
తన పదవికి రాజీనామా చేసినట్లుగా సోషల్ మీడియాలో పెట్టిన ధన్ ఖడ్ పోస్టుతో ప్రపంచానికి తెలిసిందే. అయితే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఒక కొత్త విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అదేమంటే.. తన రాజీనామా పత్రాన్ని తన సహాయకులతో రాష్ట్రపతికి అందేలా చూడకుండా తనకు తానే.. స్వయంగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.
సోమవారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన రాజీనామా అంశాన్ని ధన్ ఖడ్ వెల్లడించారు. అయితే.. దీనికి అరగంట ముందుగా ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా.. నేరుగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ధన్ ఖడ్.. రాష్ట్రపతి ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయి.. తన రాజీనామా లేఖను ఆమె చేతికి అందించిన వైనం వెలుగు చూసింది.
రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చి.. తన నివాసానికి చేరుకున్న తర్వాత.. తన రాజీనామా అంశాన్నిఅధికారికంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైనాన్ని తాజాగా గుర్తించారు. ముందస్తు షెడ్యూల్ లేకుండానే రాష్ట్రపతి భవన్ కు వెళ్లి.. రాష్ట్రపతితో భేటీ అయిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు ముందస్తుగా సమయం తీసుకొని వెళ్లటం జరుగుతుంది. అందుకు భిన్నంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా వెళ్లి కలిసిన వైనం చర్చనీయాంశంగా మారింది.
