సుప్రీంపై ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు!
ఫలానా గడువు లోపు నిర్ణయాలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి విధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన సంచలన తీర్పుపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ స్పందించారు.
By: Tupaki Desk | 18 April 2025 10:11 AM ISTఫలానా గడువు లోపు నిర్ణయాలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి విధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన సంచలన తీర్పుపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ స్పందించారు. రాజ్యసభ ఆరో బ్యాచ్ శిక్షణార్థులకు సంబంధించిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన.. సుప్రీంకోర్టు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘రాష్ట్రపతి ఫలానా సమయంలోపు నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలదు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించటం తగదు. ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని సుప్రీం ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు. కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారితనం ఉండదు. ఎందుకంటే వారికి దేశ చట్టాలు వర్తించవు’’ అంటూసంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా.. గవర్నర్లు పంపిన బిల్లులపై మూడు నెలల వ్యవధిలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పటం తెలిసిందే. ఈ అంశాల్ని ప్రస్తావిస్తూ ఉప రాష్ట్రపతి ఘాటుగా రియాక్టు అయ్యారు. రాజ్యాంగంలోని 142వ అధికరణం సుప్రీంకోర్టుకు ప్లీనరీ అధికారులు ఇచ్చింది. తన ముందుకు వచ్చిన ఏ అంశంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా అది ఆదేశాలు ఇవ్వొచ్చు. 24/7 అందుబాటులో ఉండే అణుక్షిపణి లాంటిది ఇది.
‘ఇటీవల ఒక తీర్పులో రాష్ట్రపతికే ఆదేశాలు ఇచ్చారు. మనం ఎటు పోతున్నాం. దేశంలో అసలేం జరుగుతోంది? ఇలాంటి రోజుకోసం మన ప్రజాస్వామ్యాన్ని ఎన్నడూ కోరుకోలేదు. రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా నిర్ణయాలు తీసుకోవాలట. లేదంటే అది చట్టమైపోతుందట. ఇది నాకెంతో కలవరం కలిగిస్తోంది. ఇలాంటి రోజు ఒకటి నా జీవితంలో వస్తుందని ఎన్నడూ అనుకోలేదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్రపతి పదవి అత్యంత ఉన్నతమైనది. రాజ్యాంగాన్ని పరరక్షిస్తానని రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రులు.. ఉప రాష్ట్రపతి.. ఎంపీలు.. జడ్జిలతో సహా అంతా రాజ్యాంగానికి లోబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాంటిది రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి రావటం ఏమిటి? దానికి ప్రాతిపదిక ఏమిటి? 145(3) అధికరణం కింద రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు మాత్రమే న్యాయవ్యవస్థకు ఉంది. అధికారాల విభజన ప్రకారం చూసినా.. ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు. పార్లమెంటుకు.. ఎన్నికల్లో ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుంది. పార్లమెంటులో ప్రశ్నలు వేయొచ్చు.కానీ.. కార్యనిర్వాహక పాలనను న్యాయవ్యవస్థకు ఇస్తే ప్రశ్నలు ఎలా వేస్తారు? ఎన్నికల్లో ఎవరిని జవాబుదారీని చేస్తారు? శాసన.. న్యాయ.. కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలో మరొకటి చొరబడితే అది సవాలుగా మారుతుంది. అది మంచిది కాదు’’ అని స్పష్టం చేశారు.
ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు కనిపిస్తే కేసు లేదేం? ఇలాంటి పరిణామం ఒక సామాన్యుడి ఇంట్లో జరిగితే రాకెట్ వేగంతో స్పందిస్తారు కదా? ఇక్కడ ఎడ్లబండి అంతటి వేగం కూడా లేదేం? ఎఫ్ఐఆర్ లేకపోవటం ఆశ్చర్యకరం.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఘటన జరిగిన వారం వరకుదాని గురించే ఎవరికీ తెలియదు. దీనిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ జాప్యం మౌలిక సందేహాలు లేవనెత్తదా? ప్రజలు అత్యంత గౌరవం ఇచ్చే వ్యవస్థే బోనులో నిలబడింది. నేర న్యాయవ్యవస్థ స్వచ్ఛత మన ప్రజాస్వామ్య గమనాన్ని నిర్వచిస్తుంది’’ అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు. ఊహించని రీతిలో విమర్శలు చేయటమే కాదు.. కీలక అంశాల్ని ప్రస్తావించిన ఉప రాష్ట్రపతి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుందనటంలో సందేహం లేదు.
