Begin typing your search above and press return to search.

వెర్స్ ఇన్నోవేషన్ బోర్డులోకి ఆడిటింగ్ దిగ్గజం పి.ఆర్. రమేష్: కార్పొరేట్ గవర్నెన్స్‌లో కొత్త శకం

భారతీయ డిజిటల్ కంటెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న టెక్నాలజీ దిగ్గజం వెర్స్ ఇన్నోవేషన్ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

By:  A.N.Kumar   |   31 March 2026 7:15 PM IST
వెర్స్ ఇన్నోవేషన్ బోర్డులోకి ఆడిటింగ్ దిగ్గజం పి.ఆర్. రమేష్: కార్పొరేట్ గవర్నెన్స్‌లో కొత్త శకం
X

భారతీయ డిజిటల్ కంటెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న టెక్నాలజీ దిగ్గజం వెర్స్ ఇన్నోవేషన్ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా దేశంలోని ప్రముఖ ఆడిటింగ్, ఫైనాన్షియల్ నిపుణుడు, డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్ పి.ఆర్. రమేష్ ను తమ బోర్డులోకి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆయనను ఆడిట్ కమిటీ చైర్మన్‌గా కూడా నియమించడం ద్వారా సంస్థలో పారదర్శకత, నైతిక విలువలకు పెద్దపీట వేయాలని వెర్స్ నిర్ణయించింది.

40 ఏళ్ల అనుభవం.. అగ్రశ్రేణి సంస్థలకు మార్గదర్శి

పి.ఆర్. రమేష్‌కు కార్పొరేట్ గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ ఓవర్‌సైట్ రంగాల్లో సుమారు నాలుగు దశాబ్దాల అపారమైన అనుభవం ఉంది. గతంలో ఆయన డెలాయిట్ ఇండియా ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా డెలాయిట్ గ్లోబల్ బోర్డు లో సభ్యుడిగా ఉండి అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను కేవలం ఒక రంగానికే పరిమితం చేయకుండా.. ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ (L&T), సైయంట్ ,తేజస్ నెట్‌వర్క్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల బోర్డుల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2022-23 సంవత్సరానికి గాను "బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్" అవార్డు లభించింది.

గవర్నెన్స్ ప్రమాణాలే మా ప్రాధాన్యత: ఉమంగ్ బేడీ

ఈ నియామకంపై వెర్స్ ఇన్నోవేషన్ కో-ఫౌండర్ ఉమంగ్ బేడీ హర్షం వ్యక్తం చేస్తూ.. "ఒక సంస్థ దీర్ఘకాలికంగా విజయవంతం కావాలంటే కేవలం వృద్ధి మాత్రమే సరిపోదు బలమైన గవర్నెన్స్ , ఫైనాన్షియల్ డిసిప్లిన్ (ఆర్థిక క్రమశిక్షణ) అత్యంత ముఖ్యం. పి.ఆర్. రమేష్ వంటి మేధావి మా బోర్డులో చేరడం వల్ల మా నిర్ణయాధికార ప్రక్రియ మరింత పటిష్టమవుతుంది. భవిష్యత్తులో స్థిరమైన వృద్ధిని సాధించడంలో ఆయన అనుభవం మాకు దిక్సూచిలా పనిచేస్తుంది," అని పేర్కొన్నారు.

బాధ్యతాయుతమైన వృద్ధి వైపు..

తన నియామకంపై పి.ఆర్. రమేష్ స్పందిస్తూ.. "డిజిటల్ , ఏఐ రంగంలో వెర్స్ ఇన్నోవేషన్ ఇప్పటికే అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఇలాంటి భారీ స్థాయి కలిగిన సంస్థలకు ఆర్థిక నియంత్రణలు, రిస్క్ మేనేజ్‌మెంట్ చాలా కీలకం. ఈ సంస్థలో అత్యుత్తమ విలువలను బలోపేతం చేయడానికి నా వంతు సహకారం అందిస్తాను" అని అన్నారు.

వెర్స్ ఇన్నోవేషన్ ప్రస్థానం.. డైలీ హంట్ నుండి నెక్స్ వెర్స్ వరకు స్థానిక భాషలలో ఏఐ ఆధారిత కంటెంట్‌ను అందిస్తూ కోట్లాది మంది యూజర్లను ఆకట్టుకుంటున్న వెర్స్ ఇన్నోవేషన్.. ప్రస్తుతం మూడు ప్రధాన ప్లాట్‌ఫార్మ్‌లను విజయవంతంగా నిర్వహిస్తోంది.

డైలీ హంట్: వార్తలు, సమాచార రంగంలో అగ్రగామి.

జోష్ : భారతదేశపు నంబర్ వన్ షార్ట్ వీడియో యాప్.

మాగ్జ్ టర్ : ప్రపంచవ్యాప్త డిజిటల్ పత్రికల వేదిక.

నెక్స్ వెర్స్ . ఏఐ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు.

స్టార్టప్ ఎకోసిస్టమ్ నుండి ఒక గ్లోబల్ టెక్ దిగ్గజంగా ఎదుగుతున్న వెర్స్ ఇన్నోవేషన్, పి.ఆర్. రమేష్ వంటి అనుభవజ్ఞుడిని బోర్డులోకి తీసుకోవడం ద్వారా పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తన పారదర్శకతను చాటుకుంది. ఈ నిర్ణయం సంస్థ యొక్క తదుపరి వృద్ధి దశలో కీలక మైలురాయిగా నిలవనుంది.