Begin typing your search above and press return to search.

చెప్ప‌డానికి.. విన‌డానికి బాగానే ఉంటుంది వెంక‌య్య‌గారూ!

తాజాగా ఉచితాల‌పై గ‌ళం విప్పారు. ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను పూర్తి వ్యతిరేకమని అన్నారు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 10:30 AM GMT
చెప్ప‌డానికి.. విన‌డానికి బాగానే ఉంటుంది వెంక‌య్య‌గారూ!
X

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.(మిజోరాంలో ముగిశాయి). ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అన్ని పార్టీలూ.. గెలుపు గుర్రం ఎక్కే ల‌క్ష్యంతో ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఒక‌రినిమించి ఒక‌రు హామీలు గుప్పిస్తు న్నాయి. వీటిలో ఉచితాలే ఎక్కువ‌. కాదు కాదు.. అంటూ.. బీజేపీ కూడా ఉచిత హామీలు ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఇదే పార్టీకి చెందిన మాజీ ఉప‌రాష్ట్ర‌పతి వెంక‌య్య‌నాయుడు.. తాజాగా ఉచితాల‌పై గ‌ళం విప్పారు. ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను పూర్తి వ్యతిరేకమని అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్‌లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు ఉంటాయా అని అంచనా వేయకుండా హామీలు ఇస్తుంటారని విమర్శించారు. దేశంలో పేద, మధ్యతరగతి, మధ్యతరగతికి దిగువన అనేక మంది ప్రజలు ఉన్నారని అన్నారు.

అయితే.. వెంక‌య్య చెప్పిన ఉచిత సూక్తుల‌ను వినేందుకు బాగానే ఉంటాయ‌ని.. కానీ పోరులో ఉన్న అభ్య‌ర్థుల గెలుపు ఆశ‌లు ఫ‌లించేందుకు ఇవి ప‌నిచేయ‌డం క‌ష్ట‌మేనని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతెందుకు.. ఛ‌త్తీస్‌గ‌డ్ ఎన్నిక‌ల్లో ఇదే బీజేపీ మ‌హిళ‌ల‌కు ఏడాదికి రూ.12 వేల చొప్పున పందేరం చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఇక‌, ఉచిత ప్ర‌యాణాలు య‌థాత‌థం. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ఉచిత రేష‌న్ ప‌థ‌కాన్ని మోడీ పొడిగించార‌నే విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నాయి.

ఇక‌, ఉల్లిపాయ‌ల ధ‌ర‌ల త‌గ్గింపు, గోధుమ పిండి ఔట్‌లెట్ల ఏర్పాటు వంటివి ఎన్నిక‌ల్లో జ‌నాల‌ను మెప్పించేందుకు.. త‌మ‌వైపు మ‌ళ్లించుకునేందుకు కాదా? అనేది వీరి ప్ర‌శ్న‌. అయినా.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పోరుబాట చేసి.. ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించే వాడికి ఉన్న నొప్పి వేరేగా ఉంటుంద‌ని కూడా అంటున్నారు. అస‌లు అల‌వాటే చేయ‌కూడ‌ద‌ని.. ఒక్క‌సారి అల‌వాటు చేశాక‌.. ఇక అంతేన‌ని కూడా అంటున్నారు.