ఆ రెండు ఉచితాలు చాలు...వెంకయ్య మాట వింటే పదివేలు
ఈ సృష్టిలో ఉచితంగా ఏదీ రాదు. ఒక మొక్కకు నీరు పోసి కష్టపడి పెంచితేనే ఫలాలు ఇస్తుంది.
By: Satya P | 23 Jun 2026 9:11 AM ISTఈ సృష్టిలో ఉచితంగా ఏదీ రాదు. ఒక మొక్కకు నీరు పోసి కష్టపడి పెంచితేనే ఫలాలు ఇస్తుంది. అలాగే ఈ భూమి మీద ప్రతీదీ కష్టంతో వచ్చినదే. మరి ఒకరి కష్టం మరొకరికి ఉచితం ఎలా అవుతుంది. ఇది నిజంగా అంతా ఆలోచించాల్సిన ప్రశ్న. ఇలా ఉచితాల మీద ఎంతైనా చర్చించవచ్చు. ఇదంతా ఎందుకు అంటే ఈ దేశంలో పధకాల పేరుతో ఉచితాలను అలవాటు చేశారు. అది కూడా రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు. తమ ఓట్ల పంట కోసం నాటిన ఈ ఉచిత విత్తనం ఈ రోజున కాదేదీ ఉచితానికి అనర్హం అన్నట్లుగా వట వృక్షంగా మారిపోయింది. వేస్తే వేప కొమ్మ తీస్తే అమ్మ వారు అన్నట్లుగా పరిస్థితి అయితే తయారు అయింది.
పోటా పోటీ పడి మరీ :
ఈ రోజున దేశంలోని ఆసేతు హిమాచలం అంతటా అన్ని రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఉచితాల మీదనే ఫోకస్ పెడుతున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు ఇద్దామన్న ధోరణి పెరిగింది. పైగా వారికి వెంటనే చేసే పనిగా ఇది కనిపిస్తుంది. వారికి సంతృప్తిని ఇచ్చినట్లు అవుతుంది. అందువల్ల వారికి తాము చేసినది గుర్తుంటుంది. ఆ ప్రతిఫలాలు తమకు కూడా అంతే వేగంగా దక్కుతాయని కూడా రాజకీయ పార్టీలు భావిస్తున్నారు. వారు ఆశించినట్లే జనాలు కూడా అలాగే ఆదరిస్తున్నారు. వారిని ఏ మాత్రం నిరాశ పరచడం లేదు. ఉచితాల విషయంలో ఓట్లు వేస్తున్నారు. ఎవరు ఎక్కువ పధకాలు ఇస్తే వారినే తీసుకుని వచ్చి అందలం మీద కూర్చోబెడుతున్నారు.
అప్పులతో ఖజానాలు :
ముందే చెప్పినట్లు ఉచితాలు అంటే మరో చోట నుంచి తెచ్చి ఇవ్వాల్సిందే. అలా రాష్ట్రాలు అనేకం అప్పుల ఊబిలో కూరుకుని పోతున్నాయి. ఖజానా మీద పెను భారం పడుతోంది. దాంతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సొమ్ములు లేక కిందా మీద అవాల్సి వస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రాల ప్రగతి దారులు మూసుకుని పోతున్నాయి. అయితే ఉచితాల మీద మితి మీరిన హామీల మీద మేధావులు అంతా కూడా మొత్తుకుంటున్నారు. వాటికి స్వస్తి వాచకం పలకాలని కూడా కోరుతున్నారు.
పంచడం మానుకోండి :
ఉచితాల పేరుతో విచ్చలవిడిగా విచక్షణారహితంగా పధకాలను పంచడం మానుకోవాలని పూర్వ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మరోసారి పాలకులకు సూచించారు. ఆయన తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పాతికేళ్ల ఉత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగంలో ఉచితాల మీద చెప్పాల్సింది గట్టిగానే చెప్పేశారు. ఉచితాలు వద్దాయా అవి అరుచితాలు అయిపోతాయని కూడా వెంకయ్య కామెంట్స్ చెశారు.
విద్య వైద్యం మాత్రమే :
అయితే ఈ దేశంలో రెండింటిని మాత్రం ఉచితంగా అందించాలని వెంకయ్యనాయుడు కోరారు. అవి విద్య, వైద్యం. వీటిని కనుక ఇస్తే సామాన్య ప్రజలు ఎంతగానో లాభపడతారు అని వెంకయ్య నాయుడు చెప్పారు. వీటి వల్లనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతే కాదు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వాలు ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా వెంకయ్యనాయుడు సూచించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అత్యాధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన కోరడం విశేషం.
