వెంకయ్య అన్నదొకటి: వైసీపీ ప్రచారం మరొకటి!
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ మాజీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు మంగళవారం తన సొంత జిల్లా నెల్లూరుకు వచ్చారు.
By: Tupaki Political Desk | 7 Oct 2025 4:52 PM ISTమాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ మాజీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు మంగళవారం తన సొంత జిల్లా నెల్లూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియా ప్రతినిధులను పిలిచి పలు విషయా లపై మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాల తీరు, చేస్తున్న అప్పులు, ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రస్తావించారు. అయితే.. వెంకయ్య చెప్పిన మాటల్లో ఎక్కడా ఎవరి పేరును ప్రస్తావించలేదు.
ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా వెంకయ్య కామెంట్లు చేయలేదు. కానీ, దీనిని వైసీపీ నాయకులు, ఆ పార్టీ మీడియా కూడా.. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించే వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు వెనుకేసుకువచ్చిన చంద్రబాబుపై వెంకయ్య ఆగ్రహంతో ఉన్నారని కూడా వ్యాఖ్యానించారు. దీంతో అసలు వెంకయ్య ఏమన్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.
వెంకయ్య చేసిన వ్యాఖ్యలు.
1) అటు ఏపీలో ఇటు తెలంగాణలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులు, అప్పుల కారణంగా.. ప్రస్తుత ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికైనా ఆయా ప్రభుత్వాలు తెలుసుకుని పనిచేయాలి.
2) గత ప్రభుత్వాలు(ఏవో చెప్పలేదు) చేసిన మితిమీరిన అప్పుల కారణంగా.. ఇప్పుడు ప్రభుత్వం ఏ పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయి. దీనిని బట్టి ప్రస్తుత ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. మున్ముందు ప్రభుత్వాలు అసలు కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురావద్దు.
3) ఆర్టీసీఉచిత బస్సు ఎవరికి అవసరం? నేనేమన్నా అంటే.. బాధపడతారు. లేనిపోని ఉచితాలను నెత్తిన పెట్టుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయా? ఉచితంగా ఇచ్చేవారు ఉంటే.. తీసుకునేందుకు నేను కూడా రెడీగానే ఉన్నారు. మీరు(మీడియా) మాత్రం తీసుకోరా?.
4) అసెంబ్లీలో బూతులు మాట్లాడిన నాయకులకు ప్రజలు బూతుల్లోనే(పోలింగ్) సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇంకా మారాలి. అవసరమైతే.. సభ్యులకు గత రికార్డులు చూపించి శిక్షణ ఇవ్వాలి.
5) అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం వల్ల.. ఏపీలో ఏం జరిగిందో అందరూ చూశారు. అలాంటి పరిస్థితి రావద్దని అప్పుడే చెప్పా.
6) మాతృభాషకు అన్యాయం జరుగుతోందని గతంలోనే చెప్పా.(వైసీపీ హయాంలో). కానీ, మారలేదు. అందుకే .. ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు.
.. ఇతమిత్థంగా వెంకయ్య నాయుడు చెప్పిన మాటలు ఇవి. కానీ, వైసీపీ మాత్రం.. చంద్రబాబును ఏకేశారని.. దుయ్యబట్టారని వ్యాఖ్యానించడం గమనార్హం.
