Begin typing your search above and press return to search.

'ఉచిత ప‌థ‌కాల‌' పై వెంక‌య్య హాట్ కామెంట్స్‌

ఈ క్ర‌మంలో తాజాగా గుంటూరులో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ఓ ప‌త్రికా కార్యాల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్రమంలో పాల్గొన్నారు.

By:  Garuda Media   |   5 Jan 2026 3:30 PM IST
ఉచిత ప‌థ‌కాల‌ పై వెంక‌య్య హాట్ కామెంట్స్‌
X

రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు.. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, యూపీల‌లో అమ‌ల‌వుతున్న ఉచిత ప‌థ‌కాల‌పై.. మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు వెంక‌య్య నాయుడు త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఉచిత ప‌థ‌కాల కార‌ణంగా.. ప్ర‌భుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయ‌ని తెలిపారు. దీని నుంచి బ‌య‌ట‌కు రాలేక‌.. అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టేందుకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఉంటున్నాయ‌ని.. కాబ‌ట్టి ఉచితాల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని ఆయ‌న కోరుతున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా గుంటూరులో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ఓ ప‌త్రికా కార్యాల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య మాట్లాడుతూ.. ఉచిత ప‌థ‌కాల‌పై మ‌రోసారి హాట్ కామెంట్లు చేశారు. ''ఉచిత ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను ప‌నికిమాలిన వారిగా మారుస్తున్నారు. ఇది స‌రైన విధానం కాదు. ప‌ని చేసే శ‌క్తి ఉన్న వారు.. ప‌నిచేయ‌గ‌లిగిన వ‌య‌సులో ఉన్న‌వారు కూడా ఉచితాలు ఇస్తున్నారు కాబ‌ట్టి.. తామెందుకు ప‌నిచేయాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు.

ఉచిత ప‌థ‌కాల‌ను త‌క్ష‌ణ‌మే ఆపేస్తే.,. రెండు తెలుగు రాష్ట్రాల‌కు మ‌రింత మంచిద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ఆర్థిక లోటును భ‌ర్తీ చేసుకునే అవ‌కాశం రెండు తెలుగు రాష్ట్రాల‌కూ క‌నిపించ‌డం లేద న్నారు. పైగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా.. పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలతో ప్ర‌భుత్వాలు అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌న్నారు. ''మీరు అప్పులు చేస్తున్నారంటే.. మీరు అప్పులు చేస్తున్నార‌ని ఒక పార్టీపై మ‌రోపార్టీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌ళ్లీవారు అధికారంలోకి వ‌స్తే.. అదే ప‌ని చేస్తున్నారు'' అని దుయ్య‌బ‌ట్టారు.

ఉచిత ప‌థ‌కాలు కేవ‌లం అర్హులైన వారికి మాత్ర‌మే అందాల‌ని వెంక‌య్య‌నాయుడు సూచించారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు అనుకూలంగా ఉన్న‌వారికి ఉచితాలు ఇస్తున్నార‌ని ఆరోపించారు. దీనివ‌ల్ల అస‌లైన అర్హులు న‌ష్ట‌పోతున్నార‌ని చెప్పారు. ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం అనే ఈ రెండు రంగాల్లో మాత్ర‌మే ఉచితాన్ని అనుస‌రించాల‌ని ఆయ‌న సూచించారు. అప్పుడే రాష్ట్రాలు బాగుప‌డ‌తాయ‌ని.. లేక‌పోతే అప్పులు పెరుగుతాయ‌ని హెచ్చ‌రించారు.