Begin typing your search above and press return to search.

కొత్త ఉపరాష్ట్రపతి ఎంపికపై ఉత్కంఠ! ఢిల్లీకి అర్జెంటుగా వెంకయ్య

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది.

By:  Tupaki Desk   |   11 Aug 2025 2:03 PM IST
కొత్త ఉపరాష్ట్రపతి ఎంపికపై ఉత్కంఠ! ఢిల్లీకి అర్జెంటుగా వెంకయ్య
X

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. గత కొంతకాలంగా బీజేపీ రాజకీయాలకు దూరంగా ఉన్న వెంకయ్యనాయుడు ఆకస్మికంగా ఢిల్లీకి రావడం, ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ పెద్దలతోనూ ఆయన వరుసగా సమావేశం కావడంపై అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నాయకుడిగా వెంకయ్యకు ఆర్ఎస్ఎస్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఎక్కువగా సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనే గడుపుతున్నారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలకు వెళుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆకస్మికంగా ఢిల్లీ వచ్చిన వెంకయ్య క్షణం కూడా తీరిక లేకుండా వరుసగా రాజకీయ సమావేశాలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు కొత్త ఉప రాష్ట్రపతి ఎంపికతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పూర్తయి చాలా కాలం అయింది. ఆయన స్థానంలో సరైన నాయకుడిని ఎంపిక చేయాలని భావించిన కమలం పార్టీ పెద్దలు కొన్ని నెలలుగా నడ్డా పదవీకాలం పొడిగిస్తూ వస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రాష్ట్రశాఖలకు అధ్యక్షుల నియామకం పూర్తవడంతో ఈ నెల 15 నాటికి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం ఉందంటున్నారు. అదే సమయంలో వచ్చేనెలలో కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకోడానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే సమయంలో ప్రధాని మోదీతో ఆర్ఎస్ఎస్ పెద్దలకు అంతరం వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో బీజేపీలో అత్యంత సీనియర్ నేత వెంకయ్యనాయుడు హస్తిన రావడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన వెంకయ్యనాయుడు తొలుత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిశారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎంపిక, బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకంపై వెంకయ్య సలహాలు సూచనలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని నివాసంలో సుమారు 40 నిమిషాలు గడిపిన వెంకయ్యనాయుడు ఆయనతో ఏకాంత చర్చలు జరిపారని జాతీయ మీడియా వెల్లడించింది. అయితే వీరి భేటీలోరాజకీయ అంశాలతోపాటు ప్రస్తుతం అమెరికాతో నెలకున్న టారిఫ్ వార్ పైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉండాలని వెంకయ్య అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో త్వరలో బీజేపీ అధ్యక్షుడిని నియమిస్తామని వెంకయ్యతో ప్రధాని చెప్పినట్లు సమాచారం. పలువురు పేర్లను సూచిస్తూ ఎవరైతే బాగుంటుందన్న విషయమై వెంకయ్య సలహా తీసుకున్నారని అంటున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం దేశబంధు గుప్త రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లిన వెంకయ్య అక్కడ సంఘ్ పెద్దలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ కూడా దాదాపు గంటకు పైగా జరగడంతో ఏం చర్చించారన్న విషయమై ఉత్కంఠ రేగుతోంది. ఇటీవల బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య కొన్ని విషయాలపై మాటల సంవాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా ప్రధానితో వెంకయ్య భేటీ కావడం, అనంతరం ఆయన సంఘ్ కార్యాలయానికి రావడం రాజకీయంగా ఇంట్రస్టింగ్ గా మారింది. ఇక ఆర్ఎస్ఎస్ కార్యాలయం నుంచి వెంకయ్య వెనుదిరిగిన తర్వాత బీజేపీ జాతీయ సంయుక్త కార్యదర్శి, ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే శివప్రకాశ్ వెంకయ్యతో సుదీర్ఘ చర్చలు జరపడం కూడా ఆసక్తికరంగా మారింది.

ఈ వరుస సమావేశాలు దేశ రాజకీయ పరిణామాలపై ఆసక్తిని పెంచేస్తున్నాయని అంటున్నారు. చాలా కాలం తర్వాత వెంకయ్య ఢిల్లీకి రావడం, అందునా పూర్తిగా బీజేపీ వ్యవహారాలపై ఆయన ఫోకస్ చేయడంతో హస్తిన రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి అనూహ్యంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక తర్వాతే బీజేపీ అధ్యక్షుడిని నియమించవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ రెండు పదవుల్లో ఒకటి ఉత్తరాదికి, మరొకటి దక్షిణాదికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.