ఆ కామెంట్లు కిరాతకం: వెంకయ్య నాయుడు
ఏపీ రాజధాని అమరావతిలో `ఆ తరహా` మహిళలు ఉంటారంటూ.. వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో ఓ వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 9 Jun 2025 3:27 PM ISTఏపీ రాజధాని అమరావతిలో `ఆ తరహా` మహిళలు ఉంటారంటూ.. వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో ఓ వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది జరిగి నాలుగు రోజులు అయినా.. అధికారికంగా మాజీ సీఎం జగన్ కానీ, ఆయన సతీమణి, సాక్షి ఛానెల్ చైర్మన్ హోదాలో ఉన్న భారతి కానీ.. స్పందించకపోవడంతో ఇది మరింత వివాదంగా మారుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు.
రాజధాని అమరావతిపై చేసిన కామెంట్లను ఆయన కిరాతకమైనవిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను ఎవరూ సమర్థించలేరని.. అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని కూడా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అనేక మంది రైతులు.. రాజధాని అమరావతి కోసం తమ కన్నబిడ్డల్లాంటి భూములను త్యాగం చేశారని.. ఒక్క ఎకరం భూమి ఉన్న రైతులు కూడా.. రాష్ట్ర ప్రజల కోసం భూములు ఇచ్చారని.. అలాంటి రాజధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం, హేయం, జుగుప్సాకరం అని వెంకయ్యనాయుడు అన్నారు. అమరావతి ప్రాంతంలో ప్రజలు వ్యవసాయమే వృత్తిగా ప్రవృత్తిగా జీవిస్తున్నారని.. వారు ఎంతో గౌరవంగా జీవిస్తూ.. సమాజానికి తిండి పెడుతున్నారని అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ దమన కాండను తట్టుకుని వీరోచితంగా పోరాడి.. రాష్ట్రానికి రాజధానిని నిలబెట్టారని తెలిపారు. ఇలాంటి దేవతల భూమిపై.. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని.. కఠినంగా శిక్షించాలని కూడా వెంకయ్య పిలుపునిచ్చారు.
