Begin typing your search above and press return to search.

పుట్టపర్తికి వెనిజులా ప్రెసిడెంట్.. రాక వెనుక ఆంతర్యం!

ఎయిర్‌పోర్ట్ నుండి ఆమె నేరుగా ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సాయి కుల్వంత్ హాల్‌లోని బాబా మహాసమాధిని దర్శించుకుని భక్తితో నివాళులర్పించారు.

By:  Madhu Reddy   |   7 Jun 2026 3:53 PM IST
పుట్టపర్తికి వెనిజులా ప్రెసిడెంట్.. రాక వెనుక ఆంతర్యం!
X

ఆధ్యాత్మిక నిలయం పుట్టపర్తికి ఒక అంతర్జాతీయ స్థాయి అతిథి విచ్చేశారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ శనివారం రాత్రి ఏపీలోని సత్యసాయి జిల్లాకు చేరుకున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు పరమ భక్తురాలైన ఆమె, బాబా మహాసమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజకీయ సెగలతో అట్టుడుకుతున్న తన దేశంలో శాంతి నెలకొనాలని కోరుకుంటూ ఆమె చేసిన ఈ పర్యటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఘన స్వాగతం:

వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆమెకు స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే. రత్నాకర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఆమెకు భద్రత కలిపించారు.

బాబా సన్నిధిలో ప్రార్థనలు:

ఎయిర్‌పోర్ట్ నుండి ఆమె నేరుగా ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సాయి కుల్వంత్ హాల్‌లోని బాబా మహాసమాధిని దర్శించుకుని భక్తితో నివాళులర్పించారు.ఇక కాసేపు అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేశారు. బాబా సన్నిధిలో గడపడం తనకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుందని ఆమె ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు.

భజనలో పాల్గొన్న ప్రెసిడెంట్:

డెల్సీ రోడ్రిగ్జ్ కేవలం బాబాను దర్శించుకోవడమే కాకుండా, అక్కడి భజన గీతాలాపనలో కూడా పాల్గొన్నారు. సత్యసాయి భజనలు చేస్తున్నంత సేపు ఆమె ఎంతో భక్తిశ్రద్ధలతో అందులో లీనమైపోయారు. 2024లో కూడా ఆమె పుట్టపర్తిని సందర్శించిన సంగతి తెలిసిందే. ఇక పదవిలో ఉన్నా లేకున్నా బాబాపై తనకున్న భక్తిని ఆమె మరోసారి చాటుకున్నారు.

వెనిజులాలో నాటకీయ పరిణామాలు:

అమెరికా సైనిక చర్య తర్వాత వెనిజులాలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నికోలస్ మదురోను అమెరికాదళాలు అదుపులోకి తీసుకుని న్యూయార్క్ తరలించిన నేపథ్యంలో డెల్సీ రోడ్రిగ్జ్ ఆ దేశ బాధ్యతలను స్వీకరించారు. ఇక దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆమె ఆధ్యాత్మిక తోడ్పాటు కోసం బాబా చెంతకు రావడం విశేషం.

ప్రపంచ దేశాలను శాసించే నేతలు సైతం సత్యసాయి బాబా బోధనలకు, ఆయన మహిమలకు ఆకర్షితులవుతారనేది డెల్సీ రోడ్రిగ్జ్ పర్యటనతో మరోసారి రుజువైంది. ఇక బాబా సన్నిధిలో గడపడం తనకు దక్కిన గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు. ఈ పర్యటన అనంతరం ఆమె తిరిగి వెనిజులాకు బయలుదేరి వెళ్లనున్నారు.