Begin typing your search above and press return to search.

వేమిరెడ్డి జగన్ కి షాక్ ఇస్తారా...!?

గత రాత్రి విడుదల చేసిన ఆరవ లిస్ట్ తరువాత నుంచి వేమిరెడ్డి ఏకంగా అధినాయకత్వానికి అందుబాటులోకి రాలేదు. ఏకంగా తన ఫోన్ ని స్విచాఫ్ చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Feb 2024 3:40 PM GMT
వేమిరెడ్డి జగన్ కి షాక్ ఇస్తారా...!?
X

నెల్లూరు జిల్లాలో బలమైన నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంగబలం అర్ధబలం గట్టిగా ఉన్న నేత. ఆయనకు జగన్ 2018లో రాజ్యసభ సీటు ఇచ్చారు అంటేనే ఆయన టాలెంట్ నాడే గుర్తించినట్లుగా భావించాలి. మేకపాటి రాజమోహన్ రెడ్డి తరువాత అందుకుని మరీ నెల్లూరులో పార్టీలో ముఖ్యుడిగా నిలిచారు వేమిరెడ్డి.

పార్టీ పట్ల విధేయతతో ఉంటూ అన్ని విధాలుగా సహకరించే వేమిరెడ్డి ఇపుడు జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారా అన్న చర్చకు తెర లేచింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణి ప్రశాంతికి నెల్లూరు అర్బన్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అలాగే జగన్ కూడా ఇస్తారని అనుకున్నారు.

ఎందుకంటే ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా నిలబెట్టబోతున్నారు. ఆయన తన పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే సీట్ల విషయంలో సలహా సూచనలు ఇవ్వడం కూడా సహజం. పైగా అందరినీ గెలిపించుకోవాల్సి ఉంటుంది. మరో వైపు చూస్తే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి వేమిరెడ్డికి పడదు, అందుకే ఆయనకు టికెట్ ఇవ్వవద్దు అని చెప్పేశారు.

దాని ప్రకారం వైసీపీ అధినాయకత్వం అనిల్ ని ఏకంగా జిల్లాలు మార్చి గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట ఎంపీ టికెట్ ఇచ్చింది. అది ఒకే అనుకున్నా వేమిరెడ్డి కోరిక మేరకు ఆయన సతీమణికి టికెట్ ఇవ్వకుండా అనిల్ కుమార్ అనుచరుడు అయిన ఖలీల్ కి టికెట్ ఇవ్వడంతో వేమిరెడ్డి మండిపోతున్నారు అని టాక్.

పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు కారణంగా ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. గత రాత్రి విడుదల చేసిన ఆరవ లిస్ట్ తరువాత నుంచి వేమిరెడ్డి ఏకంగా అధినాయకత్వానికి అందుబాటులోకి రాలేదు. ఏకంగా తన ఫోన్ ని స్విచాఫ్ చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అంతే కాదు నెల్లూరు జిల్లాలోని తన అనుచరులకు ఆయన ఫోన్ చేసి పార్టీ కార్యక్రమాలను ఆపు చేయాలని చెప్పారని అంటున్నారు. దీనిని బట్టి వేమిరెడ్డి ఏమి ఆలోచిస్తున్నారో అర్ధం కావడం లేదు అంటున్నారు. వేమిరెడ్డి వైఖరితో వైసీపీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది అని టాక్.

ఆయన ఫోన్ కి దగ్గరలో ఉన్న అనుచరుల ద్వారా అయినా ఫోన్ కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నా అవేమీ వర్కౌట్ కావడంలేదు. ఇటీవల కాలంలో వేమిరెడ్డి అధినాయకత్వం వైఖరి పట్ల కాస్తా గుర్రుగా ఉంటున్నారు అని టాక్ నడచింది. పైగా ఈ తరహా రాజకీయాలు చేయలేమని సన్నిహితులతో ఆయన రాజకీయ వైరాగ్యం ప్రాటించినట్లుగా కూడా చెప్పుకున్నారు.

ఇపుడు ఆయన ఏమైనా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తారా అన్నది చర్చకు వస్తుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో బలమైన రెడ్లు చాలా మంది పార్టీని వీడిపోయారు. ముగ్గురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. వేమిరెడ్డి అలాంటి నిర్ణయం తీసుకుంటే వైసీపీకి అది బిగ్ షాక్ గా పరిణమిస్తుంది అని అంటున్నారు. ఎలాగోలా వేమిరెడ్డిని టచ్ లోకి తెచ్చుకుని ఆయనకు నచ్చచెప్పాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.