నరాలు దొరకడం లేదన్న టెన్షన్ వద్దు.. ఇంజెక్షన్ల టెక్నాలజీలో సరికొత్త విప్లవం
చాలా మందికి ఇంజెక్షన్ తీసుకోవాలంటేనే భయమేస్తుంది. ముఖ్యంగా నరాలు సరిగ్గా కనిపించక నర్సులు మళ్లీ మళ్లీ గుచ్చాల్సి రావడం మరింత బాధాకరం.
By: Tupaki Desk | 22 April 2025 12:56 PM ISTచాలా మందికి ఇంజెక్షన్ తీసుకోవాలంటేనే భయమేస్తుంది. ముఖ్యంగా నరాలు సరిగ్గా కనిపించక నర్సులు మళ్లీ మళ్లీ గుచ్చాల్సి రావడం మరింత బాధాకరం. అయితే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. త్వరలోనే ఈ బాధలన్నీ తీరుపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా చర్మం మీద నరాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల నర్సులు ఒకేసారి, కచ్చితంగా ఇంజెక్షన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఓ సారి తెలుసుకుందాం.
ఈ సరికొత్త పరికరం ఒక ప్రత్యేకమైన లైటింగ్, ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది చర్మం లోపల ఉన్న రక్తనాళాలను (నరాలను) ప్రకాశవంతంగా బయటకు చూపిస్తుంది. దీని ద్వారా నర్సులు ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తిస్తారు. ఈ పరికరం కాంతిని చర్మంపై ప్రసరిస్తుంది. రక్తంలోని హీమోగ్లోబిన్ ఆ కాంతిని గ్రహించడంతో నరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దృశ్యాన్ని ఒక స్క్రీన్‌పై చూడవచ్చు, తద్వారా ఇంజెక్షన్ ఇవ్వడం చాలా సులభం అవుతుంది.
ఈ టెక్నాలజీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నరాలు సరిగ్గా కనిపించని వృద్ధులు, ఊబకాయం ఉన్న వాళ్లు, చిన్న పిల్లలకు ఇంజెక్షన్ ఇవ్వడం చాలా సులభం అవుతుంది. అలాగే, ఒకేసారి కచ్చితంగా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రోగులకు కలిగే నొప్పి, అసౌకర్యం తగ్గుతుంది. నర్సులు కూడా ఎక్కువ సమయం వెచ్చించకుండా పని పూర్తి చేయవచ్చు.
ప్రస్తుతం ఈ టెక్నాలజీ అభివృద్ధి దశలో ఉంది. కొన్ని ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ఇది విస్తృతంగా అందుబాటులోకి రానుంది. ఒకప్పుడు ఇంజెక్షన్ అంటే భయపడినవారు కూడా ఈ కొత్త టెక్నాలజీతో ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా చికిత్స చేయించుకోవచ్చు.
