ఈ సారి వీరరాఘవరెడ్డిపైనే దాడి.. ఎక్కడంటే?
చిలుకూరి అర్చకుల మీద దాడి కేసులో జైలుకు వెళ్లిన అతను.. కండీషన్ బెయిల్ మీద విడుదల కావటం తెలిసిందే.
By: Tupaki Desk | 2 May 2025 7:15 AMకొద్ది రోజుల క్రితం పతాక శీర్షికల్లో దర్శనమిచ్చిన పేరు వీర రాఘవరెడ్డి. గుర్తుకు వచ్చి.. రానట్లుగా అనిపిస్తుందా? పేరును చాలాసార్లు విన్నట్లు అనిపిస్తుందా? అయితే.. దగ్గరకు వచ్చేసినట్లే. అదేనండి.. చిలుకూరు ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడికి పాల్పడటం ద్వారా.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వీర రాఘవరెడ్డి గుర్తు ఉన్నాడు కదా? అతనిపై తాజాగా దాడి జరిగింది.
చిలుకూరి అర్చకుల మీద దాడి కేసులో జైలుకు వెళ్లిన అతను.. కండీషన్ బెయిల్ మీద విడుదల కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల్లో భాగంగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు పెట్టి రావాల్సి ఉంది. ఎప్పటిలానే గురువారం సాయంత్రం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు వీర రాఘవరెడ్డి.
స్టేషన్ నుంచి బయటకు వచ్చి తిరిగి వెళుతున్న వేళలో.. అక్కడి దగ్గర్లోని టీ స్టాల్ వద్ద ఆగారు. ఇదే సమయంలో గుర్తు తెలియని 20 మంది వ్యక్తులు వీర రాఘవరెడ్డిపై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వారి నుంచి తప్పించుకున్న అతను మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తనపై జరిగిన దాడిపై కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలాన్ని రేపింది.