Begin typing your search above and press return to search.

బాలయ్య ప్లేస్ లో వసుంధర...అక్కడంతా సందడే !

హిందూపురం అభివృద్ధి కోసం ఈ నెల 31న బాలయ్య ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలసి చర్చిస్తారని ఆమె తెలిపారు.

By:  Tupaki Desk   |   26 July 2025 2:00 AM IST
బాలయ్య ప్లేస్ లో వసుంధర...అక్కడంతా సందడే !
X

ప్రముఖ నటుడు హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. అయితే బాలయ్య వరసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. దాంతో ఆయన తన సొంత నియోజకవర్గానికి పెద్దగా సమయం ఇవ్వలేకపోతున్నారు. ఆ లోటుని సతీమణి వసుంధర భర్తీ చేస్తున్నారు.

ఆమె తన భర్తతో పాటు తరచూ హిందూపురం వస్తూంటారు. ఆమెకు హిందూపురం సమస్యలు కొట్టిన పిండే అని అంటున్నారు. దాంతో తాజాగా మరోసారి ఆమె టూర్ పెట్టుకున్నారు. హిందూపురంలో ఆమె అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

అంతే కాదు అక్కడ పాఠశాల బాలికలతో కలసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలయ్య మనసు ఎపుడూ హిందూపురం మీదనే ఉంటుందని అన్నారు. ఆయన ఎంత తీరిక లేకపోయినా హిందూపురానికి చేయాల్సిన మేలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. ఆయన మనసు ఎపుడూ హిందూపురం మీదనే ఉంటుందని వసుంధర చెప్పారు. ఒక పక్క వృత్తిపరమైన పనులు చూసుకుంటూ మరో వైపు బసవతారకం ఆసుపత్రి పనులను చూసుకుంటూ హిందూపురం మీద బాలయ్య ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వసుంధర చెప్పారు.

హిందూపురం అభివృద్ధి కోసం ఈ నెల 31న బాలయ్య ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలసి చర్చిస్తారని ఆమె తెలిపారు. హిందూపురంలో గోళ్ళపాలెం పారిశ్రామికవాడలో విద్యుత్ సమస్యను తీర్చారని గుర్తు చేశారు.

ఆగస్టు 15న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని అదే రోజున మహిళలకు ఉచిత బస్సుతో స్వాతంత్రం వస్తుందని వసుంధర చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే కానుకను అందిస్తోందని ఆమె అన్నారు.

ఇదిలా ఉండగా హిందూపురంలోని వీవర్స్ కాలనీలో పర్యటించిన ఆమె స్థానికంగా ఉన్న ఇళ్ళకు వెళ్ళి ప్రజలకు ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరించారు. సంక్షేమ పధకాలు అందరికీ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తమకు పధకాలు అందుతున్నాయాని వారు చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశాఉరు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించారు.

మొత్తానికి చూస్తే హిందూపురం గురించి పూర్తి అవగాహనతో వసుంధర మాట్లాడారు. దీనిని చూసిన వారు అంతా బాలయ్య సతీమణికి రాజకీయంగా మంచి అవగాహన ఉందని అంటున్నారు. ఇప్పటికి మూడు సార్లు బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే అన్నీ దగ్గరుండి ఆమె చూసుకుంటున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ పలకరిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. దాంతో బాలయ్యను వెన్నుదన్నుగా ఉంటున్న వసుంధర ఏదో నాటికి తాను కూడా ప్రత్యక్ష రాజకీలాలోకి వస్తారా అన్న చర్చ సాగుతోంది.

ఎందుకంటే ఆమె ఇంట్లోనే రాజకీయం ఉంది. భర్త ఎమ్మెల్యే, అల్లుళ్ళు ఇద్దరూ ఒకరు మంత్రిగా ఒకరు ఎంపీగా ఉన్నారు. దాంతో ఆమె సైతం రాజకీయ అడుగులు వేసే అవకాశం ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.