Begin typing your search above and press return to search.

ఆ అయిదు సార్లు ఎమ్మెల్యేకు ఎలాంటి పరిస్థితి!

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి రాజకీయంగా ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదని టాక్.

By:  Tupaki Desk   |   24 Aug 2023 3:30 PM GMT
ఆ అయిదు సార్లు ఎమ్మెల్యేకు ఎలాంటి పరిస్థితి!
X

నంద్యాల వరదరాజులరెడ్డి.. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘన చరిత్ర ఆయనది. ఎంతోమందిని రాజకీయాల్లో నడిపించిన గురువు ఆయన. టీడీపీలో సీనియర్ నాయకుడిగా మన్ననలు పొందారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి దారుణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో పట్టించుకునే వాళ్లు లేక.. శిష్యుల నుంచే అవమానాలు పొందుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి రాజకీయంగా ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదని టాక్. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మరో రెండు సార్లు శిష్యుల చేతుల్లోనే ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ సీటు ఇవ్వలేదనే కోపంతో పార్టీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. టీడీపీతో తనకు ఏం సంబంధం లేదని కూడా వరదరాజుల రెడ్డి ప్రకటించారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చూస్తున్నట్లు తెలిసింది.

ఇటీవల ఫారెస్ట్, సబ్ రిజిస్ట్రార్, పోలీస్ కార్యాలయాలకు వరదరాజుల రెడ్డి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అసలు టీడీపీలో వరదరాజుల రెడ్డి అనే నాయకుడు ఒకరున్నారని కూడా అధిష్ఠానం నుంచి తమకు సమాచారం లేదని వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొనడం గమనార్హం. పార్టీతో సంబంధం లేదని చెప్పిన నాయకుడు మళ్లీ ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా పని చేసిన వరదరాజుల రెడ్డి ఇప్పుడు శిష్యులతోనే ఇలాంటి మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.