వారణాసి - రోప్ వే ఉన్న ఫస్ట్ ఇండియన్ సిటీ ఇదే...
ఆధ్యాత్మిక నగరంగా ప్రసిద్ధి పొందిన వారణాసి మరో రికార్డుకు సిద్ధమైంది. భారతదేశంలోనే తొలిసారిగా వారణాసిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం అర్బన్ రోప్‌వే ట్రయల్ రన్ ప్రారంభమైంది.
By: Tupaki Desk | 17 Dec 2025 4:43 PM ISTఆధ్యాత్మిక నగరంగా ప్రసిద్ధి పొందిన వారణాసి మరో రికార్డుకు సిద్ధమైంది. భారతదేశంలోనే తొలిసారిగా వారణాసిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం అర్బన్ రోప్‌వే ట్రయల్ రన్ ప్రారంభమైంది. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి గోడోలియా వరకు 3.8 కి.మీ కారిడార్‌ను ఈరోప్ వే కలుపుతుంది, దాదాపు 220 కేబుల్ కార్ల ద్వారా ప్రయాణికుల్ని చేరవేస్తుంటారు. ప్రయాణ సమయాన్ని 50 నిమిషాల నుంచి కేవలం 16 నిమిషాలకు తగ్గిస్తుంది. ట్రాఫిక్ తలనొప్పులుండవు. ఇప్పటికే ట్రయల్ రన్స్ మొదలయ్యాయి. త్వరలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి, ఈ రోప్ వే అమల్లోకి వస్తే నగరం రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు వస్తుంది. ఈరోప్ వే వ్యవస్థకు రోజుకు లక్షమంది ప్రయాణికుల్ని చేరవేయగల సామర్థ్యం ఉంది. పూర్తిస్థాయి ఆపరేషన్ 2025 చివరి నాటికి లేదా 2026 మధ్యలో ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రఖ్యాత కాశీక్షేత్రం అంటేనే హిందువులకు పుణ్య స్థలం. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటి. ప్రతి హిందువు అవసాన దశలో ఒకసారి అయినా కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని , అన్నపూర్ణేశ్వరిని దర్శించుకోవాలని తపన పడుతునంటారు. కాశీని వారణాసి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఉత్తర ప్రదేశ్‌లో గంగా నది ఒడ్డున ఉంది, ఇక్కడ గంగా స్నానం చేస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుందని అశేష హిందువుల గొప్ప నమ్మకం. కాశీని శివుపార్వతి నివాసంగా భావిస్తారు. కాశీ విశ్వనాథుడి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి. కాశీలో అడుగడుగునా దేవాలయాలుంటాయి. శ్రీమతి అన్నీ బెసెంట్ తన 'థియోసాఫికల్ సొసైటీ'కి , పండిట్ మదన్ మోహన్ మాల్వియా ఆసియాలో అతిపెద్ద విశ్వవిద్యాలయం 'బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని' స్థాపించడానికి వారణాసిని ఎంచుకున్నారు. ఆయుర్వేదం వారణాసిలో ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు.
కేంద్ర మంత్రిత్వ శాఖ జలశక్తి సారథ్యంలో వాప్కో లిమిటెడ్ ఎంటర్ ప్రైజెస్ రూ.400 కోట్ల ప్రతిపాదనలున్న ఈ రోప్ వే సర్వీస్ తుది ప్రజంటేషన్ ఇచ్చింది. ఈప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేటు సంయుక్త భాగస్వామ్య విధానంలో నిర్వహించ నున్నారు. ఈ సందర్భంగా డివిజనల్ కమిషనర్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ...ఈ రోప్ వే సర్వీసు 220 కేబుల్ కార్లతో ప్రారంభమవుతుంది. ప్రతికేబుల్ కారులో పది సీట్లుంటాయి. ప్రతి కారుకు మధ్యలో 90 సెకన్ల గ్యాప్ ఉంటుంది. ప్రస్తుత అలైన్మెంట్ ప్రకారం కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ప్రధాన టర్మినల్ గా ఉంటుంది. సజన్, రథ్ యాత్ర, గిర్జా ఘర్ మిగిలిన స్టేషన్లు. కంటోన్మెంట్, సజన్ రైల్వే స్టేషన్ల మధ్య మలుపు లైన్ ఉంటుంది. ఈనాలుగు స్టేషన్ల లో రోప్ వే 11 మీటర్ల కన్నా ఎత్తులో ఉంటుంది. ప్రతి స్టేషన్ వద్ద ఎస్కలేటర్ల వసతి ఉంటుంది. రోప్ అలైన్ మెంట్ సమయంలో మధ్యలో భవనాలు అధికంగా రాకుండా జాగ్రత్త పడ్డారు. దాదాపు 29 భవనాలు రోప్ వే కిందికి వస్తాయని కమిషన్ అగర్వాల్ వివరించారు.
బీజేపీ కాశీ వారణాసి అభివృద్ధి ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కాశీని అభివృద్ధి పరచడం ద్వారా హిందూ సమాజానికి మరింత చేరువ కావచ్చని, మెజార్టీ ప్రజల ఓట్ల బ్యాంకును సురక్షితం చేసుకోవచ్చన్న కోణాన్ని విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ కాశీలో రూ.3,880 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పురాతన నగరం ఆధునికంగా రూపుదిద్దుకుంటోంది. పాఠశాలలు అప్‌గ్రేడ్ అవుతున్నాయి . కొత్త విద్యుత్ కేంద్రాలు వస్తున్నాయి. కాశీ తన మూలాలను సజీవంగా ఉంచుకుంటూ అభివృద్ధి చెందుతోంది. 2014 నుండి మార్చి 2025 వరకు, కాశీ అభివృద్ధి కింద రూ.48,459 కోట్ల మొత్తం పెట్టుబడితో 580 ప్రాజెక్టులను చేపట్టారు . వారణాసిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వారసత్వాన్ని సంరక్షించడం మరియు పర్యాటక రంగానికి మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం. ఈ నేపథ్యంలో వారణాసిలో రోప్ వే ట్రయల్ రన్ దశకు చేరుకోవడం మోదీ సర్కారుకు ఉత్సాహాన్నిచ్చే అంశంగా చెప్పాలి.
కాశీ పట్టణంలోనూ రోప్ వే ప్రారంభించేందుకు వాప్కో కసరత్తులు చేస్తున్నట్లు ఆధికారికర సమాచారం ప్రకారం తెలుస్తోంది. అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ మంత్రిత్వశాఖ ఇందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. 2018లో మెట్రో ప్లాన్ తిరస్కరణకు గురికావడంతో ప్రత్యమ్నాయంగా రోప్ వే విధానాన్ని ఎంచుకున్నారు. ఇంతటి వారణాసి నగరంలో రోప్ వే రావడం భక్తాదులకు నిజంగా సంతోషాన్నిచ్చే అంశం. వయసు మీదపడిన సీనియర్ సిటిజన్లు చాలా మంది కాశీకి రావడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంటారు కాబట్టి ఈ రోప్ వే ప్రారంభం వారికి అన్నివిధాల సహాయకారిగా ఉంటుంది.
