Begin typing your search above and press return to search.

అమ్మ వరలక్ష్మి టిఫిన్స్.. ఇంత పని చేశాడా!?

దీంతో.. కొత్త విలాసాల వైపు కన్ను పడింది. స్నేహితులతో కలిసి పబ్ లకు వెళ్లటం.. పార్టీలు చేయటం.. క్రమంగా డ్రగ్స్ కు.. ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు.

By:  Tupaki Desk   |   13 Sep 2023 6:01 AM GMT
అమ్మ వరలక్ష్మి టిఫిన్స్.. ఇంత పని చేశాడా!?
X

హైదరాబాద్ మహానగరంలో ఒక టిఫిన్ సెంటర్ పేరు పాపులర్ కావటం అంత మామూలు విషయం కాదు. అందునా.. వేలాది కిలోమీటర్లు విస్తరించిన మహానగరంలో ఒక టిఫిన్ సెంటర్ పేరు అందరినోట నానటం.. ఆ టిఫిన్ సెంటర్ గురించి మాట్లాడుకోవటం అంటేనే దాని సీన్ ఎంతన్నది అర్థమవుతుంది. అవును.. ఇప్పుడు చెబుతున్నది వరలక్ష్మి టిఫిన్స్ గురించే. గచ్చిబౌలిలో పాపులర్ కావటంతో మహానగరంలో దాదాపు ఏడుకు పైనే చైన్ షాపుల్ని నిర్వహిస్తున్న ఈ టిఫిన్ సెంటర్ ఆదాయం రోజుకు లక్షల్లో ఉంటుందని చెబుతారు.

వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కు సంబంధించి ఏ ఫుడ్ యాప్ లో చూసినా.. 4.4 రేటింగ్ ఉంటూ టాప్ లో నిలుస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ లో నెయ్యి కారం ఇడ్లీ.. నెయ్యి ఉప్మా దోశ.. మొదలుకొని పలు టిఫన్లు నోరూరించేలా ఉంటాయి. దీని యజమాని పేరు ప్రభాకర్ రెడ్డి. చదివింది పదో తరగతి లోపే. కాకుంటే రుచికరమైన టిఫిన్ల తయారీలో అతగాడికున్న నైపుణ్యం.. అతడి హోటల్ ను పాపులర్ అయ్యేలా చేసింది.

ఏపీలోని ప్రకాశం జిల్లాలో తోపుడు బండి మీద టిఫిన్ సెంటర్ తో మొదలైన అతడి ప్రస్థానం హైదరాబాద్ మహానగరంలో ఏడుకు పైనే టిఫిన్ సెంటర్లు.. రోజుకు లక్షల రూపాయిల కౌంటర్ తో నిత్యం హడావుడిగా ఉండే ఈ టిఫన్ సెంటర్ వెనుక ఒక చేదు నిజం షాకింగ్ గా మారింది. ఈ టిఫిన్ సెంటర్ల యజమానికి రోజు ఆదాయమే లక్షల్లో వస్తుందని చెబుతారు. దీంతో.. కొత్త విలాసాల వైపు కన్ను పడింది. స్నేహితులతో కలిసి పబ్ లకు వెళ్లటం.. పార్టీలు చేయటం.. క్రమంగా డ్రగ్స్ కు.. ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు.

పగలంతా వరలక్ష్మి టిఫిన్స్ లో ఇడ్లీ.. దోశ.. మైసూర్ బజ్జీ లాంటి రుచికరమైన టిఫిన్స్ అమ్మే ప్రభాకర్ రెడ్డి.. రాత్రి అయితే చాలు డ్రగ్స్ తీసుకునే అనురాధ అనే మహిళను స్మగ్లర్ గా మార్చి గోవా నుంచి ఆమె ద్వారా సిటీకి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయించేవాడు!. ఒకవైపు తాను వినియోగిస్తూ.. మరోవైపు అమ్మే ఈ దందా గురించి తెలిసిన పోలీసులు సైతం అవాక్కు అవుతున్నారు!. తాజాగా వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు.. వారి బ్యాక్ గ్రౌండ్ గురించి ముందు తెలీదు. తర్వాత వివరాలు తెలిసి.. విస్మయానికి గురవుతున్నారు. ఇంత మంచి బిజినెస్ ఉంచుకొని ఆదరిద్రపు గొట్టు డ్రగ్స్ దందాలోకి ఎందుకు దిగారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ పోలీసులు ఇటీవల డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ.. జల్లెడ పడుతున్నారు. దీంతో.. పోలీసుల కళ్లు గప్పేందుకు వీలుగా.. తన డ్రగ్ వ్యాపార భాగస్వామి అనురాధను విమానంలో గోవాకు పంపి.. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రెండు మూడు సిటీల్లో బస్సులు దిగి.. వేరే బస్సులు ఎక్కుతూ నగరానికి చేరుకునేవారన్న విషయాన్ని విచారణలో పోలీసులు గుర్తించారు. వరలక్ష్మి టిఫిన్స్ యజమాని నుంచి ఎవరెవరు కొనుగోలు చేస్తారన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తీగ లాగే కొద్దీ కదులుతున్న డొంకలో మరెన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తాయో చూడాలి.