Begin typing your search above and press return to search.

పేదలకు సబ్సిడీలో విదేశీ మద్యం... ఎంపీ అభ్యర్థి సంచలన హామీ!?

ప్రస్తుతం రాజకీయ నాయకులు మద్యం పేరు చెప్పి ఇస్తున్న వాగ్దానాలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 April 2024 7:47 AM GMT
పేదలకు సబ్సిడీలో విదేశీ  మద్యం... ఎంపీ అభ్యర్థి సంచలన హామీ!?
X

ప్రస్తుతం రాజకీయ నాయకులు మద్యం పేరు చెప్పి ఇస్తున్న వాగ్దానాలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీపై ఎంత రచ్చ జరగాలో అంతా జరుగుతుంది! ఈ నేపథ్యంలో ఇలాంటి తరహా హామీ ఇచ్చారు ఇండిపెండెంట్ అభ్యర్థి!

అవును... మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని చిమూర్ గ్రామానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి వనితా రౌత్.. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆమె ఒక విభిన్నమైన హామీని ఇచ్చారు! ఇందులో భాగంగా తాను అధికారంలోకి వస్తే... ప్రజలకు సబ్సిడీపై విస్కీ, బీర్ అందజేస్తానని ఎన్నికల హామీ ఇచ్చారు.

అఖిల భారత మానవతా పార్టీ అభ్యర్థి అయిన ఆమె ఈ మేరకు ఈ వాగ్దానాన్ని అందించారు! ఈ సందర్భంగా స్పందించిన ఆమె... "ఎక్కడ గ్రామం ఉందో.. అక్కడ బీర్ బార్ ఉంటుంది. ఇదే నా ఎన్నికల హామీ" అని జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా తెలిపింది. ఇదే సమయంలో సబ్సిడీ ధరలకు విదేశీ మద్యం, బీర్లతో బార్లు ఏర్పాటు చేస్తానని ఆమె పేర్కొన్నారు.

అక్కడితో ఆగని ఆమె... పేద ప్రజలు చాలా కష్టపడతారు.. వారికి ఒకే ఒక్క విలాసం మద్యం తాగడం.. కానీ, వారు నాణ్యమైన విస్కీ, బీర్ లను కొనుగోలు చేయలేరు. వారు కేవలం దేశీ మద్యాన్ని మాత్రమే తాగుతారు. అందుకే వారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యాన్ని అనుభవించాలని, దాన్ని ఆస్వాధించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాగా... వనితా రౌత్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమె నాగ్ పూర్ నుంచి పోటీ చేశారు. అనంతరం 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చిమూరు అసెంబ్లీ స్థానం నుంచీ బరిలోకి దిగారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఆమె 2019 ఎన్నికల సమయంలోనూ ఇదే వాగ్దానాన్ని ఇచ్చారు!