Begin typing your search above and press return to search.

టీడీపీకి వంగవీటి రాధా ఝలక్.. వైసీపీ నేతలకు మద్దతు!

ప్రముఖ కాపునేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Political Desk   |   21 Feb 2026 5:27 PM IST
టీడీపీకి వంగవీటి రాధా ఝలక్.. వైసీపీ నేతలకు మద్దతు!
X

ప్రముఖ కాపునేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలైన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్ కు మద్దతుగా నిలవాలని పిలుపునిస్తూ ఆయన చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ ఏ ఉద్దేశంతో ఈ ప్రకటన చేశారని సొంత పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో రాధా చేసిన ప్రకటనను తమకు అనుకూలంగా మార్చుకునేలా వైసీపీ పావులు కదుపుతోందని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మండలంలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా రాధాకృష్ణ ఈ ప్రకటన చేశారు.

తుని మండలం డి.పోలవరంలో కాపు నేత దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. వైసీపీకి చెందిన కాపునేతలు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో గ్రామస్థులు విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, ఆవిష్కరణ కార్యక్రమానికి వంగవీటి మోహనరంగా కుమారుడు అయిన మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణను ఆహ్వానించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి రాధా రాగా, కాపు నేతలు, కార్యకర్తలు, రంగా అభిమానులు భారీగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయని అంటున్నారు.

రంగా విగ్రహావిష్కరణ అనంతరం సభలో మాట్లాడిన రాధాకృష్ణ తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్ కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. వారు బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించారు. దాడిశెట్టి రాజా వైసీపీకి చెందిన తుని మాజీ ఎమ్మెల్యే. ఇక జక్కంపూటి గణేష్ రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు. ఈ ఇద్దరూ తొలి నుంచి వైసీపీలో ఉండగా, టీడీపీలో ఉన్న రాధాకృష్ణ వారికి మద్దతుగా నిలవాలని పిలుపునివ్వడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అన్న ఉద్దేశంతో కుల సంక్షేమం దృష్టిలో దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్ కు మద్దతు ఇవ్వాలని రాధాకృష్ణ కోరారా, లేక ఇంకేమైనా విశేషం ఉందా? అన్న చర్చ జరుగుతోంది. వైసీపీలో ఇమడలేక టీడీపీలోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ ఇక్కడ కూడా పార్టీలో ఇమడలేకపోతున్నారా? సరైన గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారా? అంటూ కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. తన అసమ్మతి, అసంతృప్తిని తెలియజేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారేమోనని వ్యాఖ్యానిస్తున్నారు. నామినేటెడ్ పదవిని ఆశిస్తున్న రాధాకృష్ణ అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేయడానికి ఏమైనా వ్యూహం ఎంచుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యలు టీడీపీలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.