Begin typing your search above and press return to search.

వంగవీటికి అధికార పదవులు దగ్గరా ..దూరమా ?

ప్రస్తుతం నలభై దాకా మార్కెటి యార్డు చైర్మన్ పదవుల భర్తీ ఉంది. అలాగే దేవాదాయ పాలక మండళ్ళ చైర్మన్ పదవులు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   4 April 2025 8:00 PM IST
వంగవీటికి  అధికార పదవులు దగ్గరా ..దూరమా   ?
X

వంగవీటి రాధాక్రిష్ణకు అన్యాయం జరిగింది అని అనుచరులు అభిమానులు రగిలిపోతున్నారు. తమ ఆరాధ్య దైవం వంగవీటి రంగా కుమారుడు అయిన రాధా రాజకీయ జీవితం రెండు దశాబ్దాలుగా ఏ అధికార పదవికీ నోచుకోకుండా ఎటూ కాకుండా పోవడం వారిని కలవరపెడుతోంది.

కేవలం మూడున్నరేళ్ల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అది కూడా విపక్షంలో ఉన్న రాధా తరతరాల ఖ్యాతిని అందుకున్నారు. ఉమ్మడి ఏపీలో ఆయన పేరు తెలియని వారు ఈ రోజుకీ లేరు. ఇక కోస్తా జిల్లాలలో అయితే రంగా అంటే పూనకాలే వస్తాయి. అటువంటి రంగా వారసుడికి పదవులు దక్కకపోవడమేంటి అన్నది అభిమానులను నిలదీస్తోంది.

రాధాని లైట్ తీసుకుంటున్నారు అన్న ఆక్రోశం కూడా వారిలో ఉంది. ఇదిలా ఉంటే వరసగా బుధ గురువారాల్లో రెండు రోజుల పాటు రాధా చంద్రబాబుని కలసుకుని అన్ని విషయాలూ మాట్లాడారు అన్నది ప్రచారంగా బయటకు వచ్చింది. ఈ సమావేశంలో రాధా ఏమి కోరారు, బాబు ఏ రకమైన హామీ ఇచ్చారు అన్నది ఎవరికీ తెలియకపోయినా ఇపుడు కూటమి ప్రభుత్వంలో పదవులు ఏమి ఉన్నాయన్న చర్చ అయితే సాగుతోంది.

ప్రస్తుతం నలభై దాకా మార్కెటి యార్డు చైర్మన్ పదవుల భర్తీ ఉంది. అలాగే దేవాదాయ పాలక మండళ్ళ చైర్మన్ పదవులు ఉన్నాయి. కొన్ని కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. అయితే రాధా స్థాయికి ఈ పదవులు ఏమి సరిపోతాయని అభిమానులు అనుచరులు చర్చించుకుంటున్నారు. రాధాకు న్యాయంగా దక్కాల్సింది మంత్రి పదవి అని వారు అంటున్నారు. రంగా కనుక జీవించి ఉంటే కాపుల ఆశలను తీర్చేలా ఉమ్మడి ఏపీకి ఏనాడో సీఎం అయ్యేవారు అన్నది వారి గట్టి నమ్మకం.

రంగా వారసుడు రెండు దశాబ్దాల పై చిలుకు రాజకీయ జీవితంలో మంత్రి కూడా కాకపోతే ఎందుకు అన్నదే వారికి పట్టుకున్న బాధ అని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా రాధాను చేస్తారు అని అనుకున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవి నాగబాబుకు దక్కింది. మంత్రిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది.

దాంతో వంగవీటి ప్రాభవం పలుకుబడి ఒక బలమైన సామాజిక వర్గంలో అంతేనా అన్న చర్చ కూడా వస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఆరేళ్ళ క్రితం చేరి ప్రతిపక్షంలో అయిదేళ్ళ పాటు పనిచేసిన రాధా 2024లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా పార్టీ గెలుపునకు కృషి చేశారు అని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఆయన చేసిన సేవలకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తేనే సముచితంగా ఉంటుందని అంటున్నారు.

రాధా స్థాయికి హోదాకు అదే తగినది అంటున్నారు. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఖాళీలు 2027 దాకా అయితే లేవు. వైసీపీకి చెందిన ఐదుగురు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినా వాటిని చైర్మన్ ఆమోదించలేదు. దాంతో అవి ఖాళీలుగా లేవు. దాంతో మరో రెండేళ్ళ పాటు వేచి చూడాల్సిందే అని అంటున్నారు. ఈలోగా రాధాకు నామినేటెడ్ పదవి ఇచ్చినా అది హోదాకు తగినదా కాదా అన్నదే అభిమానుల ఆలోచనగా ఉంది.

ఒకవేళ ఇప్పటికి నామినేటెడ్ పదవి ఇచ్చినా 2027లో ఎమ్మెల్సీ ఖాళీల సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిందే అని అంటున్నారు. ఇక రాధా కూడా తనకు దక్కాల్సిన పదవి విషయంలో బాబుకు చెప్పాల్సింది చెప్పి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా రంగా వారసుడి రాజకీయం ఏ తీరం చేరుతుందో ఆయనకు అధికార పదవులు దగ్గరా లేక దూరమా అన్నది రాబోయే రోజులలో తెలుస్తుంది అని అంటున్నారు.