Begin typing your search above and press return to search.

వంగవీటి మీద మళ్ళీ మొదలైందా ?

వంగవీటి అన్న పేరు వింటేనే పొలిటికల్ గా వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. అంతటి పవర్ ఫుల్ పేరు అది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 9:12 AM IST
వంగవీటి మీద మళ్ళీ మొదలైందా ?
X

వంగవీటి అన్న పేరు వింటేనే పొలిటికల్ గా వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. అంతటి పవర్ ఫుల్ పేరు అది. వంగవీటి రంగా కోస్తా జిల్లాలతో పాటు తెలుగు నాట ఈ రోజుకీ ఒక ఐకానిక్ ఫిగర్ గా ఉన్నారు. ఆయన ఎనభైల చివరిలో సృష్టించిన రాజకీయ కలకలం అంతా ఇంతా కాదు. ఆయన వారసుడిగా ఉన్న వంగవీటి రాధా క్రిష్ణ మాత్రం గత రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో పెద్దగా గ్రాఫ్ పెంచుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

ఆయన ఇరవై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో గెలిచింది ఒకే ఒకసారి. అది 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నుంచి అని గుర్తు చేస్తున్నారు. ఇక 2009, 2014 లలో ఆయన వరసగా ప్రజారాజ్యం వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా పోటీ కూడా చేయకుండా దూరంగా ఉన్నారు.

ఇక చూస్తే కనుక ఆయన తన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ప్రజారాజ్యం, వైసీపీ టీడీపీ ఇలా నాలుగు పార్టీలు మారారు. అయితే ఇపుడు ఆయన గురించి మరో ప్రచారం మొదలైంది. ఆయన మళ్లీ కొత్త రాజకీయం స్టార్ట్ చేస్తారు అని. టీడీపీకి దూరంగా ఉంటున్నారు అని.

ఇక కడపలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన టీడీపీ మహానాడులో రాధా కనిపించలేదు అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగింది. ఆయన నిజంగా రాలేదా, రాకపోతే ఎందుకు రాలేదు అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. వంగవీటి రాధా ప్రముఖ నాయకుడిగా కోస్తా జిల్లాలలో ఉన్నారు. అటువంటి నాయకుడు ఎందుకు మహానాడుకు దూరంగా ఉన్నారని కూడా అంతా ఆలోచిస్తున్నారు

ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తితో ఉన్నారని మళ్ళీ ప్రచారం మొదలైంది. నిజానికి ఆయనకు గడచిన పదహారేళ్లుగా ఎలాంటి అధికార పదవీ దక్కలేదని అభిమానులు అనుచరుల ఆవేదనగా ఉంది. దానికి ఆయన స్వయంకృతాపరాధం కూడా కారణం అంటున్నారు.

ఆయన గెలిచిన పార్టీలో ఉండక అదే సమయానికి ఓడిన పార్టీలోకి వెళ్ళడం వల్ల కూడా చాన్స్ దక్కలేదని అంటున్నారు. ఇక 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినా ఆయనకు ఏడాదిగా చూస్తే ఏ పదవీ దక్కలేదని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి ఆయనకు ఇస్తామని చెప్పారని అంటున్నారు. కానీ అది ఏమీ జరగలేదు.

చూడబోతే 2028 దాకా ఎమ్మెల్సీ పదవులు ఏవీ ఖాళీలు అయ్యే సూచనలు లేవు. అప్పటిదాకా ఖాళీగా కూర్చోవడమేనా అన్న చర్చ కూడా అనుచర వర్గాలలో సాగుతోందిట. దానికి తోడు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని కూడా అంటున్నారు. దీంతో ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్తారు అని సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

అయితే రాధా పార్టీలు మారేది లేదని ఆయన టీడీపీలోనే ఉంటారని పదవుల విషయంలో ఆయనకు తపన కూడా లేదని అనే వారూ ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఏది పుకారో ఏది నిజమో తెలియడం లేదు. దాంతో రాధా చుట్టూ మళ్ళీ ఈ రకమైన ప్రచారం మొదలైంది. దానికి కారణం ఆయన పెద్దగా యాక్టివ్ గా కనిపించకపోవడమే అని అంటున్నారు. అదే జరిగితే వీటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి రాధా రాజకీయ జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఆయన చురుకైన పాత్రతో మళ్లీ జనంలోకి ఏ విధంగా వస్తరో అని అంటున్నారు అంతా.