వంగవీటి రాధాకు చంద్రబాబు బంపర్ ఆఫర్!
విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు పదవీ యోగం పట్టనుంది. త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
By: Tupaki Desk | 3 April 2025 8:13 AMవంగవీటి అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. తమ అభిమాన నాయకుడు వంగవీటి మోహనరంగా ఏకైక కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరగుతోంది. వాస్తవానికి నెల రోజుల క్రితం భర్తీ చేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లోనే రాధాకు చాన్స్ దక్కాల్సివుంది. కానీ, పొత్తు ధర్మంతో రెండు సీట్లు వదులుకోవాల్సి రావడంతో రాధాకు నిరాశే ఎదురైంది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ బదులుగా నామినేటెడ్ పదవి ఇవ్వాలని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయం చర్చించేందుకే రాధాను బుధవారం సీఎం పిలిపించి మాట్లాడినట్లు సచివాలయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.
విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు పదవీ యోగం పట్టనుంది. త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. చాలాకాలంగా పార్టీనే నమ్ముకుని ఉన్న రాధాకు సరైన గుర్తింపు ఇవ్వాలని టీడీపీలో డిమాండ్ ఎక్కువవుతోంది. ముఖ్యంగా టీడీపీ యువనేత లోకేశ్ కు రాధా అత్యంత సన్నిహితంగా మెలుగుతుండటం, రాజధాని ప్రాంతంలో బలమైన కాపు సామాజికవర్గాన్ని కాపాడుకోవాలనే వ్యూహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ కారణంగా కాపులు ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నా, టీడీపీలో కూడా కాపులకు ప్రాధాన్యమిస్తున్నామనే సంకేతాలు పంపాలని టీడీపీ అధిష్టానం యోచిస్తోందని అంటున్నారు. దీనికితోడు రాజధాని ప్రాంతంలో వంగవీటి మోహనరంగా అభిమానులను ఆకట్టుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రాధాకు నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వాలని తొలుత పార్టీ భావించిందని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని చూసినా, సీనియర్లు, ఇన్చార్జిలు, పొత్తుల వల్ల కుదరలేదు. పార్టీ మాత్రం ఉమ్మడి గుంటూరు, కృష్ణ జిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట రాధాను బరిలోకి దింపాలని చూసింది. అయితే తాను నగరంలోనే పోటీ చేస్తానని, లేదంటే పోటీకి దూరంగా ఉంటానని రాధా చెప్పడంతో పార్టీ నిర్ణయం మార్చుకుంది. నగరంలో రాధాకు సర్దుబాటు చేయలేకపోయినా, ఆయన ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా, రాధాకు పదవి దక్కకపోవడంపై ఆయన అభిమానుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఆయన కొన్నాళ్లు అనారోగ్యం బారిన పడటం కూడా వారిని ఆవేదనకు గురిచేసింది. మరోవైపు పార్టీ కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా, రాధాను పరిగణలోకి తీసుకోకపోవడం మరింత అసంతృప్తిని రాజేసింది. అయితే రాధాను ఎమ్మెల్సీ చేద్దామనే అధిష్టానం ఆలోచనతో ఆయన అభిమానులు ఇన్నాళ్లు ఎదురుచూశారు. కానీ, పొత్తుల వల్ల తాజాగా జరిగిన ఎన్నికల్లో రాధాకు చాన్స్ దక్కలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చేవారం భర్తీ చేయబోయే నామినేటెడ్ పదవుల భర్తీలో రాధాకు కీలక పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారని అంటున్నారు. తన ప్రతిపాదనను రాధాకు తెలియజేసి ఆయన ఆమోదం కూడా తీసుకోవాలని భావించారు. దీంతో ప్రత్యేకంగా రాధాను పిలిపించి మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి ఏమన్నది? తాను ఏం చెప్పినదీ రాధా వెల్లడించకపోవడంతో ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం రాధాకు మంచి పదవి ఇచ్చే విషయంపైనే చర్చ జరిగిందని అంటున్నారు.