విగ్రహాలకే 'రంగా' పరిమితం: వారసుడిపై ట్రోల్స్!
వంగవీటి మోహన రంగా. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కాపు నాయకుడిగానే కాకుండా.. పేదల నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 4 July 2025 4:19 PM ISTవంగవీటి మోహన రంగా. ఈ పేరుకు పెద్దగాపరిచయం అవసరం లేదు. కాపు నాయకుడిగానే కాకుండా.. పేదల నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. శుక్రవారం ఆయన జయంతి. ఈ కార్యక్రమాన్ని ఆయన వారసుడు వంగవీటి రాధాకృష్ణ జోరుగా నిర్వహిస్తున్నారు. విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విగ్రహాలు ఏర్పాటు చేశారు. భోజనాలు కూడా పెట్టారు. అయితే.. ఈ వ్యవహారంపై కాపు నాయకుల్లో అసంతృప్తి ఏర్పడింది.
విగ్రహాలకే రంగా పరిమితమా? అంటూ.. ట్రోల్స్ చేస్తున్నారు. దీనివెనుక ఎవరున్నారన్నది తెలియదు కానీ.. రాధాను మాత్రం బాగానే సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి రంగా ఎప్పుడూ తన విగ్రహాలను పెట్టాలని కానీ.. పూజించాలని కానీ కోరుకోలేదు. ఎంతసేపూ.. ప్రజలకు చేరువ అవ్వాలని ఆశించారు. వారి సమ స్యలపై ఉద్యమించాలని.. ప్రశ్నించాలని.. వారికి అండగా ఉండాలని కోరుకున్నారు. ఈ ఉద్యమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఇది దండలో దారం వంటివి. ప్రజలను మచ్చిక చేసుకుంటే.. వారి గుండెల్లో చోటు సంపాయించుకుంటే.. ఇక, అసలు ఇబ్బందులు ఉండవన్నది రంగా పాటించిన సూత్రం. ఇది వాస్తవం కూడా. అందుకే ఆయన ప్రజానాయకుడిగా నిలిచిపోయారు. ఈ తరహా సూత్రాన్ని.. రాధా పాటించడం లేదన్నది మెజారిటీ రంగా అభిమానులు చెబుతున్న మాట. పైకి ఎవరూ ఏమీ అనకపోయినా.. లోలోన మాత్రం ఇదే అసంతృప్తి వారిని వెంటాడుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. ప్రజల కోసంపనిచేసే స్కోప్ కూడా ఉంది. వాటిని వదిలేసి.. కేవలం రంగా జయంతి, వర్ధంతులకు మాత్రమే ఆయన వారసుడిగా తెరమీదికి రావడం.. రెండు దండలు వేసి.. రెండు విగ్రహాలు ఆవిష్కరించి అక్కడికే పరిమితం కావడం పట్ల.. రంగా అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ముందు ప్రజల్లో ఉండాలని.. వారు చెబుతున్నారు. అప్పుడే రంగా తాలూకు ఎసెన్స్ ఏదైతే ఉందో... అది రాధాకు.. కొనసాగుతుందని అంటున్నారు. అలా లేనప్పుడు.. రంగాను కేవలం విగ్రహాలకే పరిమితం చేసినప్పుడు.. రాధా రాజకీయం లేనట్టేనని అంటున్నారు.
