Begin typing your search above and press return to search.

ఏబీవీ సలహాలు తీసుకుంటా.. వంగవీటి రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు

విజయవాడ కార్పొరేషన్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ తన ప్రత్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   24 Oct 2026 7:06 PM IST
ఏబీవీ సలహాలు తీసుకుంటా.. వంగవీటి రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు
X

విజయవాడ కార్పొరేషన్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ తన ప్రత్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ అభివృద్ధి విషయంలో ఏబీ వెంకటేశ్వరరావు అనుభవాన్ని వాడుకుంటామని, ఆయన సలహాలను స్వీకరిస్తానని వెల్లడించారు. ఒక్క ఏబీ వెంకటేశ్వరరావు మాత్రమే కాదు విద్యావంతులు, అనుభవనీయుల సూచనలు, సలహాలు పాటిస్తానని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో తనకు సవాల్ విసురుతున్న ప్రత్యర్థి విషయంలో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై ఏబీవీ చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ఆయన విషయంలో రాధాకృష్ణ పరిణితి ప్రదర్శించారని వ్యాఖ్యానిస్తున్నారు.

విజయవాడలో వంగవీటి కుటుంబానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి అధికారిక కూటమి వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను మేయర్ గా బరిలోకి దింపిందని అంటున్నారు. వంగవీటి కుటుంబంతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న నగర వాసులు ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నారని చర్చ జరుగుతున్న సమయంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అనూహ్యంగా పోటీలోకి వచ్చారు. దీంతో విజయవాడ నగర రాజకీయం ఒక్కసారిగా మారిపోయిందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల మద్దుతుతో జనసేన మేయర్ అభ్యర్థిగా రాధాకృష్ణ దూకుడు చూపుతున్నారని అంటున్నప్పటికీ ప్రత్యర్థి ఏబీవీ రూపంలో గట్టి పోటీ ఇస్తుండటమే చర్చనీయాంశం అవుతోంది.

ఈ పరిస్థితుల్లో తనను ఢీకొట్టేందుకు సిద్ధమైన ప్రత్యర్థి ఏబీవీపై జనసేన అభ్యర్థి రాధాకృష్ణ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ఏబీవీ, కూటమి అభ్యర్థిని ఓడించేందుకు కంకణం కట్టుకుని తిరుగుతున్నా, రాధాకృష్ణ మాత్రం ఆయన విమర్శలను తేలిగ్గా తీసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. తాను ఏబీవీని విమర్శించను అని చెప్పడమే కాకుండా ఆయన సలహాలు, సూచనలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతం పంపడం ద్వారా ఏబీవీ దూకుడుకు బ్రేకులు వేశారని అంటున్నారు. ఈ విషయంలో రాధాకృష్ణ తన రాజకీయ అనుభవాన్ని చక్కగా ప్రదర్శించారని అభినందనలు అందుకుంటున్నారు. తనకు గట్టి పోటీ ఇస్తూ అడుగడుగునా రాజకీయంగా ఇబ్బందులు తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్న ఏబీవీని మరింత రెచ్చగొట్టకూడదు అన్న ఉద్దేశంతో ఆయన విషయంలో తాను సానుకూలంగా ఉన్నానని సంకేతాలు పంపేలా రాధాకృష్ణ జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు.

ఇక రాధాకృష్ణ వ్యాఖ్యలు ఏబీవీ మద్దతుదారులను ఆలోచనకు గురిచేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా విజయవాడ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక ప్రధాన సామాజికవర్గం వారితోపాటు విద్యావంతులు, మేధావులను ఆకట్టుకునేలా రాధాకృష్ణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. తన కుటుంబం, అనుచరులు దూకుడుగా ఉంటారనే అపప్రదను ఏమాత్రం దగ్గరకు రానీయకుండా, హుందా రాజకీయాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఇక విజయవాడ నగర అభివృద్ధి విషయంలోనూ తనకు స్పష్టమైన అవగాహన ఉందని రాధాకృష్ణ చెబుతున్నారు. మేయరుగా గెలవకముందే నగరం అభివృద్ధికి బ్లూ ప్రింట్ రెడీ చేసేందుకు ఒక కన్సల్టెన్సీతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. దీంతో కేవలం పదవిని అనుభవించడానికే కాదు, నగరం రూపురేఖలు మార్చే సత్తా కూడా తనకు ఉందని రాధాకృష్ణ ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి రాజకీయంగా కాస్త మెతకగా ఉంటారని భావించే రాధాకృష్ణ ఎన్నికల ప్రచారంలో అత్యంత తెలివిగా, మరింత జాగ్రత్తగా నడుచుకోవడం ద్వారా నగర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారని అంటున్నారు.