Begin typing your search above and press return to search.

రాధా కౌగిలింత.. ఏబీవీ ఫిదా.. బెజవాడలో ఆసక్తికర పరిణామం

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలతో రాజకీయం వాడివేడిగా మారిపోయింది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో అగ్గి రాజేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2026 12:39 PM IST
రాధా కౌగిలింత.. ఏబీవీ ఫిదా.. బెజవాడలో ఆసక్తికర పరిణామం
X

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలతో రాజకీయం వాడివేడిగా మారిపోయింది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో అగ్గి రాజేస్తున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలతో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా తయారైంది. దాడులు, ప్రతిదాడులు, పోలీసు లాఠీదెబ్బలతో అక్కడక్కడ రక్తం చిందింది. ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ రాజకీయాలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మేయర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారు మాటలతో కత్తులు దూసుకుంటున్నప్పటికీ ఎదురుపడినప్పుడు పరస్పర ఆలింగనాలతో హుందాగా వ్యవహరిస్తున్నారు.

విజయవాడలో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్న జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, స్వతంత్ర అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) వ్యవహారశైలి ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడుతున్న ఏబీవీ తన ప్రధాన ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణ విషయంలో సామరస్యంగా నడుచుకోవడం చర్చనీయాంశం అవుతోంది. అటువైపు జనసేన అభ్యర్థి వంగవీటి సైతం రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీతో గట్టిపోటీ ఎదురవుతున్నప్పటికీ, ఆయన విషయంలో సహృదయంతో నడుచుకుంటున్నారు. దీంతో ఈ ఇద్దరి వ్యవహారశైలి హాట్ టాపిక్ అవుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్, జడ్పీ ఎన్నికల సందర్బంగా పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార కూటమి నేతలు, విపక్షానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు పరస్పరం ఎదురైతే ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఎక్కువగా ఉంది. దీంతో నామినేషన్ల దగ్గర నుంచి ప్రచారం వరకు పోలీసులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకరికొకరు ఎదురుపడకుండా ముందస్తు ఏర్పాట్లు, బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే విజయవాడలో మాత్రం ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. నగరంలో పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రచారం జరుగుతుండటంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

నిజానికి విజయవాడలో అధికార కూటమి, విపక్షం వైసీపీ ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించేవి. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే బొండా అనచరులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్గీయుల మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్ ఎన్నికలపై ఆందోళన వ్యక్తమైంది. అయితే అనూహ్యంగా వైసీపీ శ్రేణులు పెద్దగా హడావుడి చేయకపోగా, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఎంట్రీతో ఎన్నిక ఆసక్తికరంగా మారిపోయింది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో స్వతంత్రంగా పోటీచేస్తున్న ఏబీవీ విజయవాడ నగర సమస్యలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో కూటమి నేతలు ఏబీవీ పట్ల గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరిగింది.

ఇక విజయవాడ నగరంలో కుల రాజకీయాల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం వల్ల వంగవీటి వర్సెస్ ఏబీవీ ఎపిసోడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన రోజురోజుకు ఎక్కువ అవుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ పూర్తి హుందాగా వ్యవహరిస్తుండటం వల్ల ప్రస్తుత రాష్ట్ర రాజకీయానికి భిన్నమైన వాతావరణం విజయవాడలో కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం ఏబీవీ అంటే తనకు గౌరవమని, ఆయన సలహాలు, సూచనలు పాటిస్తానంటూ జనసేన అభ్యర్థి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. దీంతో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ఎదురైన రాధాకృష్ణను స్వతంత్ర అభ్యర్థి ఏబీవీ ఆత్మీయంగా పలకరించారు. ఆ వెంటనే వంగవీటి రాధాకృష్ణ తన వాహనం దిగి నేరుగా ఏబీవీ వద్దకు వచ్చి ఆత్మీయ అలింగనం చేసుకున్నారు.

ఈ పరిణామం ఇద్దరు మద్దతుదారులను ఆకర్షించింది. ఆ సమయంలో ఇరువురి వెంట భారీగా కార్యకర్తలు ఉండగా, అంతా ఈ అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇక ఏబీవీ సైతం ఈ అరుదైన సందర్భాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘బెజవాడ రాజకీయాల్లో సంచలనం’ అంటూ వంగవీటి రాధాకృష్ణ ఆలింగనాన్ని పేర్కొన్న ఏబీవీ.. తాము రాజకీయాల్లో మాత్రమే ప్రత్యర్థులమని ఆలింగనంతో ఆత్మీయులమేనని చాటామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కులాల పేరుతో కత్తుల దూసే రాజకీయాలకు ఆలింగనంతో సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో కొద్దిరోజులుగా ఈ ఇద్దరి మధ్య పోటీతో రెండు ప్రధాన సామాజికవర్గాల మధ్య గొడవలు సృష్టించాలని భావించిన వారికి చురకులు అంటించారని అంటున్నారు. మొత్తానికి వంగవీటి, ఏబీవీ ఆలింగనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.