గీతకు అభయం.. వైసీపీలో కీలక మార్పు.. !
సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీ వంగ గీత కు వైసిపి అధినేత కీలక హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
By: Garuda Media | 17 April 2026 8:00 PM ISTసీనియర్ నాయకురాలు మాజీ ఎంపీ వంగ గీత కు వైసిపి అధినేత కీలక హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానాన్ని తిరిగి ఆమెకు ఇవ్వనున్నట్టు జగన్ స్వయంగా చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గీత డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా కాకినాడ నుంచే ఎంపీగా పోటీ చేయాలని గీత భావించారు.
కానీ, నియోజకవర్గాల మార్పులో భాగంగా ఆమెను పిఠాపురం నియోజకవర్గానికి కేటాయించారు. కానీ, ప్రస్తుతం పిఠాపురంలో తాను పోటీ చేసేది లేదని గత కొన్నాళ్లుగా గీత చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నియోజకవర్గంలో కూడా పర్యటించడం దాదాపు తగ్గించేశారు. ఏదో మొక్కుబడిగా పర్యటనలకు వెళ్తున్నా.. పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాత్రం అందుబాటులో ఉండడం లేదన్నది వాస్తవం. పైగా కాకినాడ నియోజకవర్గంలో ఆమె ఎక్కువగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి తనకు కాకినాడ ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్న విషయం గత కొన్నాళ్లుగా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల గీత దంపతులు జగన్ ను కలిసినప్పుడు వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేసేందుకు అభయం ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా జనసేన పార్టీ యువనేత తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈయనకు బలమైన పోటీ ఇచ్చేలా గత ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ ను వైసిపి రంగంలోకి దింపినప్పటికీ ఆశించిన విధంగా ఫలితం కనిపించలేదు.
దీంతో వంగా గీత అయితేనే బాగుంటారని అంచనా వేసుకున్న వైసిపి.. ఇప్పుడు తిరిగి ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక అమల్లోకి వస్తే అప్పుడు జరిగే మార్పులను బట్టి కూడా వంగా గీత వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ దఫా తను పార్లమెంటుకే పోటీ చేస్తానని చెబుతున్న గీతకు అనుకూలంగానే పార్టీ వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన గీత మహిళ నాయకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఆమెకు పార్లమెంటు స్థానం ఇచ్చేలా హామీ ఇచ్చిందని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే గీత పార్లమెంటు పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. కాకినాడలోనే ఎక్కువగా ఆమె పర్యటనలు కూడా చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందని చూడాలి.
