Begin typing your search above and press return to search.

వందే భారత్ కు ‘గులేర్’ దెబ్బ.. పిట్టను కొట్టబోతే

ఈ నేపథ్యంలో దేశంలో మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:39 PM GMT
వందే భారత్ కు ‘గులేర్’ దెబ్బ.. పిట్టను కొట్టబోతే
X

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనది.. ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులును కలిగి ఉన్నది భారతీయ రైల్వే శాఖ. అయితే, బ్రిటీష్ కాలం నాటి వ్యవస్థలు రైల్వేలో ఇంకా కొన్ని కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా రైళ్ల వేగంలో. దీనికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ‘‘వందే భారత్’’ అంటూ హై స్పీడ్, అధునాతన వసతులతో రైళ్లను తీసుకొచ్చింది. ఇవి అత్యద్భుత స్థాయిలో విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రముఖ నగరాలను అనుసంధానం చేస్తూ వేసిన ఈ సర్వీసుల సీట్లన్నీ నిండిపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదారు వందే భారత్ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో సికింద్రాబాద్-తిరుపతి సర్వీసు అత్యంత విజయవంతం అయింది. హైదరాబాద్+ విశాఖపట్టణం సర్వీసుకూ మంచి ఆదరణ దక్కుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలకు వందే భారత్ మంచి రవాణా సదుపాయంగా నిలిచింది.

గతంలో పలుచోట్ల రాళ్ల దెబ్బలు

వందే భారత్ రైళ్లు మంచి స్పీడ్ తో వెళ్తుంటాయి. ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేందుకు ఇవి మెరుగైన సాధనాలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు వీటిపై దాడులకు పాల్పడిన ఉదంతాలు వెలుగుచూశాయి. బెంగాల్, కర్ణాటక, యూపీ, తెలంగాణలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగినవి అయితే.. తెలంగాణలో అనుకోకుండా ఓ ఘటన చోటుచేసుకుంది. పిట్టను కొట్టబోతే పొరపాటున గులేరులో ఉన్న రాయి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కు తాకింది. జనగామ అంబేడ్కర్‌ నగర్‌ కు చెందిన హరిబాబు (60) పిట్టలను కొట్టి వాటి మాంసం తింటుంటాడు. ఇలా శుక్రవారం గులేర్ నుంచి రాయితో పిట్టను కొట్టబోగా అది పొరపాటున విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళుతున్న 20833 నంబరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కు తగలడంతో అద్దం పగిలింది. దీంతో రాళ్లు విసిరిన కేసులో హరిబాబును శనివారం కాజీపేట ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. దాడి కారణంగా రైలు కాసేపు ఆగిపోయింది. ప్రయాణికులు అసౌకర్యం ఎదుర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాల్లో విచారించగా హరిబాబు చేసిన పని అని తేలింది. గులేరును సీజ్‌ చేసి హరిబాబును అరెస్టు చేశారు.