Begin typing your search above and press return to search.

'వందే భారత్'లో ప్రయాణించే వారిలో అత్యధికులు వారే

మోడీ సర్కారు ఘనంగా పట్టాల మీదకు ఎక్కించిన వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   25 Oct 2023 4:26 AM GMT
వందే భారత్లో ప్రయాణించే వారిలో అత్యధికులు వారే
X

మోడీ సర్కారు ఘనంగా పట్టాల మీదకు ఎక్కించిన వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన ఈ రైలు ప్రయాణం సామాన్యులకు దూరంగా ఉండటమే కాదు..రైల్వే స్టేషన్ లో ప్రయాణానికి వచ్చే వారిలోని బడుగు.. బలహీన వర్గాల్లో అత్యధికులు ఒకసారైనా ఈ రైల్లో ప్రయాణించే కల తీరుతుందా? అని ఫీలవుతారని చెప్పాలి. ఈ రైలు వేగం విషయంలో చెప్పే మాటలకు.. చేతలకు మధ్య దూరం ఇప్పటికే పలు కథనాల్లో బయటకు వచ్చింది.

ఈ రైళ్ల టైమింగ్ విషయంలోనూ కథలు కథలుగా తమ అనుభవాల్ని చెబుతారు ప్రయాణికులు. ఖరీదెక్కించే ఈ ట్రైన్ కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఆసక్తికర నివేదిక ఒకటి విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఇప్పటివరకు నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. జోన్ పరిధిలో ఉన్న వందే భారత్ రైళ్ల విషయానికి వస్తే..

1. సికింద్రాబాద్ - విశాఖపట్నం

2. సికింద్రాబాద్ - తిరుపతి

3. కాచితూడ - యశ్వంత్ పుర్

4. విజయవాడ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్

ఈ రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో అత్యధికులు యువత మాత్రమేనని వెల్లడించింది. సగటున 29.08 శాతం మంది 25-34 ఏళ్ల మధ్య ఉన్న యూత్ ఇందులో జర్నీ చేస్తున్నట్లుగా పేర్కొంది. అదే సమయంలో మధ్య వయస్కులు సైతం యూత్ కంటే తక్కువగా ప్రయాణిస్తున్నట్లుగా వెల్లడించింది.

35-49 ఏళ్ల మధ్య వారు 26.8 శాతం మంది మాత్రమే ఇప్పటివరకు వందే భారత్ లో ట్రావెల్ చేశారు. సీనియర్ సిటిజన్లు కేవలం 11.8 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఐదారు గంటల కంటే ఎక్కువగా సీటులో కూర్చొని ప్రయాణం చేయాల్సి రావటం.. నడుం వాల్చటానికి అవకాశం లేకపోవటంతో వందే భారత్ కు పెద్ద వయస్కులు ప్రయాణం చేసేందుకు మక్కువ చూపటం లేదంటున్నారు. త్వరలో వచ్చే వందే భారత్ స్లీపర్ వెర్షన్ లో పెద్ద వయస్కులు సైతం పెద్ద ఎత్తున ప్రయాణించే వీలుంటుంది. ఈ రైళ్లలో ఉండే టికెట్ ఛార్జీలు ఎగువ మధ్యతరగతి.. సంపన్న వర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉండటంతో వారు మాత్రమే ఈ రైళ్లల్లో ప్రయాణించే వీలుందని మాత్రం చెప్పక తప్పదు.