Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలకు 2 వందేభారత్ లు.. షెడ్యూల్ ఇదే

ఈ నెల 24న అంటే.. మరో మూడు రోజుల్లో వర్చువల్ పద్దతిలో ఒకేసారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 9 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు

By:  Tupaki Desk   |   21 Sep 2023 6:09 AM GMT
తెలుగు రాష్ట్రాలకు 2 వందేభారత్ లు.. షెడ్యూల్ ఇదే
X

ప్రస్తుతం వందే భారత్ ట్రైన్ల హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరి కొత్త రైళ్లకు బదులుగా మోడీ సర్కారు.. వందే భారత్ సిరీస్ ను లాంఛ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ట్రైన్లకు భిన్నంగా.. హైస్పీడ్ రైళ్లను.. తక్కువ స్టేషన్లలో ఆగేలా వీటిని ప్లాన్ చేయటం తెలిసిందే. రెండు పెద్ద నగరాల మధ్య వేగవంతంగా ప్రయాణం చేయటానికి అనువుగా వీటిని నడుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ రైళ్ల ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకండా జెండా ఊపుతూ ప్రారంభిస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఆయన మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. సాధారణంగాఒక కొత్త సిరీస్ రైళ్లను ప్రారంభించటం లాంటివి కేంద్ర రైల్వే మంత్రులు చేస్తారు. అందుకు భిన్నంగా ప్రధాని మోడీ మాత్రం.. వందే భారత్ సిరీస్ లోని ప్రతి రైలును తానే ప్రారంభించేలా చేయటం విశేషం.

ఈ నెల 24న అంటే.. మరో మూడు రోజుల్లో వర్చువల్ పద్దతిలో ఒకేసారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 9 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ తొమ్మిది రైళ్లలో రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాలకు దక్కాయి. అందులో ఒకటి కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ (బెంగళూరు) వెళ్లే రైలు ఒకటి కాగా.. రెండోది విజయవాడ నుంచి చెన్నై వెళ్లే ట్రైన్ ఇంకొకటి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే ఈ రెండు రైళ్లలో.. కాచిగూడ - యశ్వంత్ పూర్ వందే భారత్ ఏపీలోనూ పరుగులు తీస్తుంది. కానీ.. విజయవాడ - చెన్నై ట్రైన్ కు మాత్రం తెలంగాణ గుండా ప్రయాణించదు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభయ్యే వందే భారత్ రైళ్ల షెడ్యూల్ విషయానికి వస్తే..

కాచిగూడ - యశ్వంత్ పూర్ (సెప్టెంబరు 25 నుంచి ఫాలో అయ్యే షెడ్యూల్)

- కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్ పూర్ కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది.

- యశ్వంత్ పూర్ లో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

- ఆగే స్టేషన్లు

- మహబూబ్ నగర్

- కర్నూలు

- అనంతపురం

- ధర్మవరం

- హిందూపురం

విజయవాడ - చెన్నై వందే భారత్

- విజయవాడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. చెన్నైకు మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకుంటుంది.

- చెన్నైలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది.

- ఆగే స్టేషన్లు

- తెనాలి

- ఒంగోలు

- నెల్లూరు

- రేణిగుంట