వందేమాతరం....అవమానిస్తే అంతే సంగతులు !
ఈ గీతం మొత్తం చూస్తే కనుక భారత దేశం సహజ సౌందర్యాన్ని తేజస్సుని, సమృద్ధిని ఎంతగానో కొనియాడుతుంది, కీర్తిస్తుంది. ఇది ఉత్తేజపూరితమైన జాతీయ గీతంగా నిలిచింది.
By: Satya P | 17 July 2026 4:23 AM ISTవందేమాతరం ఇప్పటికి 151 ఏళ్ళ క్రితం పుట్టింది. దీనిని 1870 లలో బంకించంద్ర చటర్జీ రచించగా 1950 లో ప్రభుత్వం అధికారికంగా స్వీకరించింది. వందేమాతరం గీతం అన్నది ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలిచింది అంతే కాదు వందేమాతరం భారతదేశ జాతీయ గీతంగా కూడా ఉంది. ఈ గీతం సారం అర్ధం చాలా ఉంది. ఈ గీతం మొత్తం చూస్తే కనుక భారత దేశం సహజ సౌందర్యాన్ని తేజస్సుని, సమృద్ధిని ఎంతగానో కొనియాడుతుంది, కీర్తిస్తుంది. ఇది ఉత్తేజపూరితమైన జాతీయ గీతంగా నిలిచింది.
అవమానిస్తే నేరం :
అటువంటి వందేమాతరం గీతానికి సంపూర్ణమైన గౌరవం ఇచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సిద్ధపడుతోంది. జనగణమన జాతీయ గీతం తరహాలోనే వందేమాతరం గీతానికి కూడా పూర్తి గౌరవం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లుని రూపొందించింది. ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా గీతాన్ని అవమానిస్తే నేరంగా పరిగణిస్తారు. ఇక ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్స్ టూ నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్లు -2026 పేరుతో ఈ బిల్లుని రూపొందించారు. దీనిని పార్లమెంట్ ముందు చర్చకు పెట్టబోతున్నారు.
ఈ బిల్లు వివరాలు ఇవే :
ఇదిలా ఉంటే జాతీయ గీతం జనగణమనకి ఉన్నటువంటి చట్టపరమైన రక్షణనే జాతీయ గీతం వందేమాతరానికి కూడా కల్పించాలని లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్టుకుంది. ప్రతిపాదిత చట్టంలోని కీలక వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. వందేమాతరం ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అవమానించడం అలాగే గీతానికి భంగం కలిగించడం లేదా అడ్డుకోవడం వంటివి శిక్షార్హమైన నేరంగా పరిగణించబడతాయి. ఇక శిక్షలు చూస్తే ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జాతీయ గీతానికి విధించే శిక్షల వంటివే విధించబడతాయి. వీటిలో గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే జరిమానా లేదా రెండూ విధించే అవకాశం కూడా ఉంది.
ఇవన్నీ తప్పనిసరిగానే :
ఇక నియమావళిని తీసుకుంటే 2026లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుబంధంగా ఇది ఉంటుంది. ఆ మార్గదర్శకాల ప్రకారం అధికారిక వందేమాతరాన్ని వాయించినా లేదా పాడినా ప్రేక్షకులు అటెన్షన్‌లో నిలబడాలి. అలాగే, జన గణ మనతో పాటు వందేమాతరాన్ని ప్రదర్శిస్తే, దానిని ముందుగా వాయించాలని కూడా ఈ ప్రతిపాదిత బిల్లులో నిర్దేశించబడింది. ఈ మేరకు జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్టాన్ని సవరించే ప్రతిపాదనను కేంద్ర మంత్రి వర్గం తాజాగా ఆమోదించింది. దాంతో వందేమాతరం గీతం ఇక మీద ఎవరు అయినా ఏ విధంగా అవమానించినా పూర్తిగా శిక్షార్హులు అవుతారు అన్న మాట. అది గుర్తు పెట్టుకుని గౌరవించడం అందరి బాధ్యత. అంతే కాదు తప్పనిసరి కర్తవ్యంగా ఉండబోతోంది.
