Begin typing your search above and press return to search.

కశ్మీర్ లోయలో వందే భారత్... గొప్పతనం ఏమిటి అంటే..?

అవును... కశ్మీర్ లోయలో తొలిసారి వందేభారత్ రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

By:  Tupaki Desk   |   31 March 2025 7:09 PM IST
Vande bharat train to kashmir
X

కశ్మీర్ లోయ లో తొలిసారి వందేభారత్ రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వాస్తవానికి కశ్మీర్ ను రైల్వే సర్వీసులతో అనుసంధానించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 1997లోనే ప్రారంభమైనప్పటికీ... అనేక భౌగోళిక, వాతావరణ సవాళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా జాప్యం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

అవును... కశ్మీర్ లోయలో తొలిసారి వందేభారత్ రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 19న తొలి వందే భారత్ రైలు కాట్రా నుంచి కశ్మీర్ కు పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఏప్రిల్ 19న ప్రధాని మోడీ ఉదంపుర్ వస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా ఆ రోజు ఈ ఎత్తైన వంతెనను సందర్శించడంతో పాటు, ప్రారంభిస్తారని.. అనంతరం కాట్రా నుంచి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని అన్నారు. ఉదయంపుర్ - శ్రీనగర్ - బారాముల్లా మధ్య 272 కి.మీ. ప్రతిష్ఠాత్మక రైలు లింక్ ప్రాజెక్టును మోడీ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.

వాస్తవానికి జమ్ము రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున జమ్ము - కాట్రా - శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలుత కాట్రా నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా స్పందించిన రైల్వే అధికారులు... ఈ రైలు లింక్ ప్రాజెక్ట్ గత నెలలోనే పూర్తయ్యిందని.. ట్రయల్ రన్ కూడా సక్సెస్ ఫుల్ గా ముగిసిందని వెల్లడించారు.

ఈ రైలు ప్రారంభోత్సవంతో కశ్మీర్ కు ప్రత్యక్ష రైలు అనుసంధానం చేపట్టాలన్న చిరకాల డిమాండ్ నెరవేరినట్లయ్యింది. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని సంగాల్డాన్, బారాముల్లా మధ్య.. కాట్రా నుంచి దేశంలోని మిగతా గమ్యస్థానాలకు మాత్రమే రైల్ సర్వీసులు ఉన్నాయి.

ప్రత్యేకతలివే:

ఈ ప్రాజెక్టులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో భాగంగా... ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 119 కిలోమీటర్ల పొడవునా 38 సొరంగాలు ఉండగా.. వీటిలో 12.75 కిలోమీటర్ల మేర నిర్మించిన టీ-49 సొరంగం అత్యంత పొడవైనది. ఇదే సమయంలో.. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 927 వంతెనలు సైతం ఉన్నాయి.

వీటిలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కూడా ఉండగా.. దీని ఎత్తు 359 మీటర్లు. కాగా... పారిస్ లోని ఐపిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ కావడం విశేషం!